ఈ ఏడాది మే 15వ తేదీ నుంచి తెలంగాణా రాష్ట్రంలో రైతులందరికీ ఎకరాకు రూ.4,000 చొప్పున పంట పెట్టుబడి అందిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఒక నెల ముందుగానే అంటే ఏప్రిల్ 20వ తేదీ నుంచే రైతులకు చెక్కులు అందజేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. కనుక చెక్కుల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేసుకోవాలని ఆదేశించారు. అలాగే తరువాత పంటకు నవంబర్ 18వ తేదీ నుంచి చెక్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. వ్యవసాయంలో ఆధునీక విధానాలను అమలుచేస్తున్న రైతన్నలకు సబ్సీడీపై వరినాట్లు వేసే యంత్రపరికరాలను అందజేయాలని ఆదేశించారు.
ఈ నెల 25,26 తేదీలలో తెలంగాణా రైతు సమన్వయ సమితి సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. 25న హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జనగామ, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, జోగుళాంబ-గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి-షాద్‌నగర్ జిల్లాలకు చెందిన రైతులతో, 26న కరీంనగర్‌లో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీమ్-ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాలకు చెందిన రైతు సమన్వయ సమితి సభ్యులను ఆహ్వానించాలని ఆదేశించారు. ఆ సదస్సులలో తాను సమన్వయ సమితి సభ్యులతో ముఖాముఖి మాట్లడాలనుకొంటున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.