మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ నిన్న మొన్నటి వరకు భాజపా నేతలతో కంటే తెరాస నేతల పక్కనే ఎక్కువగా దర్శనమిచ్చేవారు. ఏమంటే ‘ప్రోటోకాల్’ అనేవారు. కేంద్రమంత్రి పదవి ఊడిన తరువాత కూడా చాలా రోజులు తెరాసకు సన్నిహితంగానే మెలిగారు. కానీ క్రమంగా తెరాసకు దూరం జరుగుతూ ఇప్పుడిప్పుడే తెరాస సర్కార్ పై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.
హైదరాబాద్ లో భాజపా కార్యాలయంలో నిన్న పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం అందించే సహాయం అందుకొంటూనే మరోపక్క కేంద్రాన్ని విమర్శించడం తెరాస నేతలకు దురలవాటుగా మారిపోయింది. తెరాస ఎంపిలు కవిత, జితేందర్ రెడ్డి తదితరులు డిల్లీలో కేంద్రమంత్రులను కలిసినప్పుడు కేంద్రభుత్వాన్ని పొగుడుతుంటారు. కానీ హైదరాబాద్ రాగానే మళ్ళీ కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ద్వందవైఖరి ప్రదర్శిస్తుంటారు. ఎకనామిక్ కారిడార్ ఏర్పాటుచేయడానికి కేంద్రం రాష్ట్రానికి రూ.3,000 కోట్లు మంజూరు చేసింది. ఇంకా పలు ప్రాజెక్టులకు బారీగా నిధులు విడుదల చేసింది. కేంద్రం అందిస్తున్న ఈ సహాయసహకారాల గురించి తెరాస నేతలు ఎన్నడూ ప్రస్తావించరు. కానీ ఇంకా ఏదో చేయలేదని విమర్శిస్తుంటారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం గురించి తెరాస సర్కార్ చేసుకొంటున్న ప్రచారానికి జరుగుతున్న పనులకు చాలా తేడా ఉంది. తెరాస పనులు మాటలకే పరిమితమైతే, కేంద్రప్రభుత్వం ఆచరణలో చూపిస్తోంది. రెంటికీ అదే తేడా!” అన్నారు.