రాష్ట్రంలో రెడ్డి కులస్తులలో పేదలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు, ప్రభుత్వ సంక్షేమ పధకాలు ఇవ్వాలని కోరుతూ ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ‘కాకతీయ రెడ్ల శంఖారావం సభ’ జరిగింది. దానికి రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింసింహారెడ్డి, కాంగ్రెస్ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, భాజపా రూరల్ జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
హోం మంత్రి నాయిని నర్సింసింహారెడ్డి సభకు వచ్చిన వారిని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ ‘సమాజంలో ఎవరికీ రిజర్వేషన్లు ఇవ్వాలనేది రాజ్యాంగం ప్రకారమే జరుగుతుంది తప్ప మీరో నేనో కోరుకొంటే రాదని’ అన్నారు. దాంతో కొందరు నాయినికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన తెలిపారు. వారిని శాంతింపజేయడానికి సభ నిర్వాహకులు చాలా కష్టపడాల్సి వచ్చింది. అప్పుడు నాయిని మళ్ళీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తెలంగాణా రెడ్డి సంఘాల ఐక్యవేధిక చేస్తున్న 10 డిమాండ్లలో 4-5 పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. మిగిలిన డిమాండ్లపై చర్చలు జరుపుతామన్నారు. రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేసి రెడ్డి కులస్తులలో నిరుపేదలకు ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని విధాల సహాయసహకారాలు అందించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. వారికి ప్రభుత్వ సంక్షేమ పధకాలను వర్తింపజేయడానికి కృషి చేస్తానని మంత్రి నాయిని నర్సింసింహారెడ్డి హామీ ఇచ్చారు.