అమెరికా ఆర్ధిక సహాయం నిలిపివేసినా...

శనివారం తెల్లవారుజామున కొందరు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లోని సుంజ్వాన్ అనే ప్రాంతంలో గల ఆర్మీ క్యాంప్ లో జొరబడి కాల్పులు జరిపారు. వారి దాడిలో ఒక జవాన్, అయన కుమార్తె గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులు వినపడగానే క్యాంప్ లోపల ఉన్న ఆర్మీ జవాన్లు అప్రమత్తమయ్యి ఎదురుకాల్పులు జరుపుతూ ఉగ్రవాదులను నిలువరించగలిగారు. ఈ సమాచారం అందుకొన్న ఆర్మీ అధికారులు ఆ ప్రాంతానికి అదనపు భద్రతదళాలను తరలించారు. డ్రోన్ కెమెరాలు, హెలికాఫ్టర్ల సహాయంతో ఉగ్రవాదుల జాడ కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భద్రతదళాలు పరిసర ప్రాంతాలలో అన్ని పాఠశాలలను మూయించివేసి, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. జైష్-ఏమహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. 

ఉగ్రవాదులు భారత్-పాక్ సరిహద్దులు దాటి ఏకంగా ఆర్మీ క్యాంప్ లోకే జొరబడి కాల్పులు జరపడం వారి తెంపరితనానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ, ఆయుధాలు సమకూరుస్తోందని ఆరోపిస్తూ అమెరికా, పాకిస్తాన్ కు ఆర్ధిక సహాయం నిలిపివేసినప్పటికీ దాని వక్రబుద్ధి మారలేదని ఈ సంఘటన నిరూపిస్తోంది.