రేవంత్ రెడ్డి తెదేపాలో ఉన్నంత కాలం భాజపాను, కేంద్రప్రభుత్వాన్ని పల్లెత్తు మాటనలేదు. కారణం అందరికీ తెలిసిందే. కానీ అయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత కెసిఆర్ తో బాటు ప్రధాని నరేంద్ర మోడీని కూడా విమర్శించేందుకు వెనుకాడటం లేదు.
కేంద్రబడ్జెట్ లో ఆంధ్రా,తెలంగాణా రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసిన మోడీ సర్కార్, గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. మోడీ బడ్జెట్ ప్రసంగం చాలా చౌకబారుగా... గ్రామాలలో రచ్చబండ దగ్గర సామాన్య ప్రజలు మాట్లాడుకొన్నట్లు ఉందన్నారు. ప్రధాని మోడీకి విదేశీపర్యటనలపై ఉన్న మోజు దేశ ప్రజల సమస్యలు తీర్చడంలో లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక సమస్యలు పేరుకుపోయున్నాయని తెలిసి ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ, ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి ఒక్కసారైనా మాట్లాడలేదని విమర్శించారు. గుజరాత్ ఎన్నికలు, రాజస్థాన్ ఉపఎన్నికల ఫలితాలతో మోడీ కంగుతిన్నారని ఆ షాక్ తోనే అయన ఆవిధంగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణాకు న్యాయం చేయనందున రాష్ట్రంలో భాజపాకు స్థానం లేదన్నారు. వచ్చే ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు భాజపాకు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం అని రేవంత్ రెడ్డి అన్నారు.
కేంద్ర బడ్జెట్ లో అన్యాయం చేసినందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్రాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కనుక రేవంత్ రెడ్డి కూడా మోడీ సర్కార్ పై విమర్శలు చేయడం సహజమే. అయితే పార్టీలో సీనియర్ నేతలెవరూ దీనిపై ఇంకా నోరు విప్పక మునుపే రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.