కెసిఆర్,మోడీ సర్కార్లకు ప్రత్యామ్నాయం మేమే

నల్లగొండ పట్టణంలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర ద్వితీయ మహాసభల చివరి రోజైన బుధవారంనాడు తెలంగాణా రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన నేతృత్వంలో 13 మందితో కూడిన కార్యవర్గం, 60 మంది రాష్ట్ర కమిటీ ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శులుగా ఎస్ వీరయ్య, టి.టి.జ్యోతి, సున్నం రాజ్య, జూలకంటి రంగారెడ్డి, జి రాములు,  చెరుకుపల్లి సీతారాములు, డిజి నర్సింహరావు  జి నాగయ్య, చుక్క రాములు, నంద్యాల నర్సింహారెడ్డి, పి సుదర్శన్ రావు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, “సిపిఎం నేతృత్వంలో ఏర్పాటు చేసిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే శక్తిగా ఎదుగుతుంది. ముందుగా మన రాష్ట్రంలో బడుగులకు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించడానికి కలిసివచ్చే పార్టీలనన్నిటినీ ఒక్క త్రాటిపైకి తీసుకురాగలిగాము. మాతో కలిసివచ్చే ఇతరపార్టీలకు కూడా స్వాగతం పలుకుతున్నాము. ఈ మూడున్నరేళ్ళలో మల్లన్నసాగర్ , ఆశావర్కర్ల సమస్యలు, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా సిపిఎం పోరాటాలు చేసింది. ఇకపై బిఎల్ఎఫ్ లో అన్ని పార్టీలను కలిసి పోరాటాలు చేస్తాయి. అటు కేంద్రంలో మోడీ సర్కార్, ఇటు రాష్ట్రంలో తెరాస సర్కార్ రెండూ కూడా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. రెండూ మాటలకే పరిమితమయ్యాయి. కనుక ఆ రెంటికీ బిఎల్ఎఫ్ ఒక్కటే సరైన ప్రత్యామ్న్యాయం. బిఎల్ఎఫ్ మాత్రమే ప్రజా సమస్యలను పరిష్కరించగలదని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.