రాష్ట్ర ఐటి శాఖామంత్రి కేటిఆర్ బుధవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రం తెలంగాణా రాష్ట్రానికి చాలా ఇచ్చిందని చెప్పుకొంటుంది. కానీ బాహుబలి సినిమా కలెక్షన్స్ అంత కూడా ఇవ్వలేదు. అయినా మిత్రపక్షమైన తెదేపాకే నిధులు ఇవ్వనప్పుడు ఇక మాకు ఇస్తుందని ఎలా అనుకోగలము?మిత్రపక్షాన్నే మెప్పించలేని మోడీ సర్కార్ తెలంగాణా ప్రజలను ఎందుకు పట్టించుకొంటుంది? తెలంగాణా తరపున ఉన్న ఒక్క కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కూడా పదవిలో నుంచి సాగనంపారు కదా!” అన్నారు.
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య గురించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై కేటిఆర్ స్పందిస్తూ, “కాంగ్రెస్ అంటేనే ఒక లోఫర్ పార్టీ. 1991లో కాంగ్రెసోళ్ళు హైదరాబాద్ లో చేసిన నరమేధం ఎవరైనా ఎప్పటికైనా మరిచిపోగలరా? అటువంటి నేతలా మాపై ఆరోపణలు చేసేది? స్థానికంగా జరిగిన గొడవలలో జరిగిన హత్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించి, దానినుంచి రాజకీయ మైలేజీ పొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. వారు శవరాజకీయాలు చేస్తూ మళ్ళీ మాపై ఆరోపణలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది,” అన్నారు.
ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ పార్టీ స్థాపించడం గురించి మాట్లాడుతూ, “ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. వారిని ప్రజలు ఆశీర్వదిస్తారా లేదా అనేది ఎన్నికల వచ్చినప్పుడు తెలుస్తుంది. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు, కూటములు వచ్చినా తెలంగాణా ప్రజలందరూ మావైపే ఉన్నారని బలంగా నమ్ముతున్నాము,” అని కేటిఆర్ అన్నారు.
రాహుల్ గాంధీ అంటే పప్పు అని దేశప్రజలందరికీ తెలుసని గూగుల్ లో ‘పప్పు’ అని కొడితే రాహుల్ గాంధీ పేరు, చిత్రాలే దర్శనమిస్తాయని కేటిఆర్ చమత్కరించారు. గద్వాల్ సవాలుకు తాను కట్టుబడి ఉన్నానని కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డే దానిని స్వీకరించకుండా కుటుంబాలు, గుడారాలు అంటూ తప్పించుకొంటున్నారని కేటిఆర్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తమపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత కాలం క్రితం తెరాస తలుపు తట్టిన వారేనని కేటిఆర్ అన్నారు.