తెలంగాణాలో లక్షలాదిమంది ఇళ్ళు లేని నిరుపేదలున్నారు. తెరాస అధికారంలోకి వస్తే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తామని కెసిఆర్ ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. అధికారంలోకి రాగానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ వాటికి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. మొదట భూసేకరణ, వాటి కోసం నిధుల ఏర్పాటుకు చాలా సమయం పట్టింది. ఆ తరువాత ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇళ్ళను నిర్మించడానికి కాంట్రాక్టర్లను ఒప్పించి పనులు మొదలుపెట్టించింది. ఈలోగా సిమెంట్ ధరలు పెరగడంతో మళ్ళీ సిమెంట్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి వారిని ఒప్పించి మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా బస్తాకు రూ.230 చొప్పునే అందించడానికి ఒప్పించగలిగింది. కానీ ఇప్పుడు స్టీల్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలలో ఇళ్ళను నిర్మించడం తమ వల్లకాదని, కనుక సిమెంట్ లాగే స్టీల్ ను కూడా నిర్ణీతధరకే అందించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో నిర్మితమవుతున్న 2.60 లక్షల ఇళ్ళకు సుమారు 5.27 లక్షల టన్నుల స్టీల్ అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కనుక అంత బారీ స్థాయిలో కొనుగోలు చేస్తున్నప్పుడు స్టీల్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు కూడా సామాజిక బాధ్యతగా భావించి ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్టీల్ కంపెనీల ప్రతినిధులను కోరారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కేటిఆర్, హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ ఎం.భూంరెడ్డి స్టీల్ కంపెనీల ప్రతినిధులతో సోమవారం సచివాలయంలో సమావేశమయ్యి వారితో దీనిపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో స్టీల్ కంపెనీలు కూడా భాగస్వాములు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. దీని గురించి తమ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి తమ అభిప్రాయం తెలియజేస్తామని స్టీల్ కంపెనీల ప్రతినిధులు మంత్రులకు తెలియజేశారు.