ఒకప్పుడు ఖమ్మం జిల్లా తెదేపాకు కంచుకోటగా ఉండేది. రాజకీయాలలో హేమాహేమీలైన తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు జిల్లాలో తెదేపాకు రధచక్రాలవలే ఉండేవారు. కానీ వారిరువురి మద్య భేదాభిప్రాయాలు రావడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానం అందుకొని తుమ్మల నాగేశ్వర రావు తెరాసలో చేరి మంత్రిపదవి చేపట్టారు. ఆయనతోబాటే అనేకమంది తెదేపా కార్యకర్తలు కూడా తెరాసలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఖమ్మం జిల్లాలో తెదేపా క్రమంగా బలహీనపడింది. ఈ నేపద్యంలో నామా నాగేశ్వరరావు కూడా పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో తెదేపా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది కనుక అయన పార్టీ మారలనుకొంటే సహజమే. కానీ తాను పార్టీ మారడం లేదని అయన స్పష్టం చేశారు.
కూసుమంచిలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, “కొంతమంది స్వార్ధ రాజకీయ నేతలు మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోయారు. అంతటితో ఆగకుండా పార్టీలో ఉన్నవారిని కూడా పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నారు. వారికి కృతజ్ఞత లేకపోయినా, నేటికీ పార్టీకి అండగా నిలబడిన కార్యకర్తలను పార్టీ మారాలని బెదిరించడం, భయపెట్టడం సిగ్గుచేటు. మా పార్టీ కార్యకర్తల జోలికివస్తే నేను సహించను. మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే విజయం సాధించగలము,” అన్నారు.
నామా మాటలు వినడానికి బాగానే ఉన్నాయి కానీ ఈవిధంగా మాట్లాడిన చాలా మంది నేతలు కూడా పార్టీ ఫిరాయించిన సంగతి అందరూ కళ్ళారా చూశారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు ఆయనకు అటువంటి ఆలోచన లేనిదే ఇటువంటి ఊహాగానాలు ఎందుకు పుట్టుకువస్తాయి? తెలంగాణాలో తెదేపా భవిష్యత్ అగమ్యగోచరంగా ఉన్నప్పుడు నామా నాగేశ్వరరావుతో సహా ఆ పార్టీలో ఎవరైనా ఎప్పుడైనా పార్టీ మారే అవకాశాలున్నాయి. కాకపోతే కాస్త ముందు వెనుకా అంతే!