కోమటిరెడ్డి సోదరులంటే కాంగ్రెస్ నేతలకు భయం!

కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాపసభలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు తెరాస సర్కార్ హత్యా రాజకీయాలు చేస్తోందని తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వారి ఆరోపణలపై తెరాస కూడా అంతకంటే ఘాటుగా స్పందించింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిశోర్‌కుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, రమావత్ రవీంద్రకుమార్ తదితరులు మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. 

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేధాల కారణంగానే గొడవలుపడి హత్యలు చేసుకొనేవరకు వెళ్ళి మళ్ళీ అందుకు తెరాసను నిందించడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకే హత్యా రాజకీయాల సంస్కృతి అలవాటని సంతాపసభ పెట్టి అధికారపార్టీ నేతల, కార్యకర్తల శవాలు మోరీలలో తేలుతాయని చెప్పడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనమని తెరాస నేతలు అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జైపాల్ రెడ్డి వంటి సీనియర్ నేతలున్న వేదికపై నుంచే కోమటిరెడ్డి వంటినేతలు తెరాస కార్యకర్తల శవాలు మోరీలలో తేలుతాయని బెదిరిస్తుంటే వారు ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఇద్దరూ కోమటిరెడ్డి సోదరులను చూసి భయపడే నల్లగొండ జిల్లాలో అడుగుపెట్టడానికి కూడా భయపడుతున్నారన్నారు. అందుకే వారు జిల్లాలో ఇంతవరకు ఒక్కసారి కూడా కాంగ్రెస్ సమావేశం నిర్వహించడానికి ధైర్యం చేయలేకపోయారని తెరాస నేతలు ఎద్దేవా చేశారు.

శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో జేరడానికి సిద్దపడుతున్నట్లు తెలుసుకొన్న కోమటిరెడ్డి సోదరులే అతనిని హత్య చేయించి ఉండవచ్చని తెరాస నేతలు అనుమానం వ్యక్తం చేశారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ తో తెరాసకు ఎటువంటి విభేదాలు లేవని అతను తెరాసలోకి రావాలనుకొంటున్నట్లు తెలిసి చాలా సంతోషించామని అన్నారు. ఒకవేళ అతను బ్రతికి ఉండి ఉంటే నేడు తెరాసలో ఉండేవారన్నారు. శ్రీనివాస్ హత్యపై కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలు చేసి రాజకీయ లబ్దిపొందాలని చూడటం చాలా నీచమని తెరాస నేతలు అన్నారు.