టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం త్వరలోనే ‘తెలంగాణా జనసమితి’ అని పార్టీ స్థాపించబోతున్నట్లు స్పష్టమైంది. ఒకవేళ అది ఒంటరిగా పోటీ చేయదలిస్తే ఏడాది వ్యవధిలో పార్టీ నిర్మాణం, దానిని ప్రజలకు చేరువచేసి వారిని పార్టీవైపు ఆకర్షించడం, పార్టీ తరపున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్ధులను సిద్దం చేసుకోవడం వగైరా అన్నీ చాలా కష్టమైన పనులే. అంత కష్టపడినా కాంగ్రెస్, తెరాసలను తట్టుకొని నిలబడటం చాలా కష్టం కనుక తప్పనిసరిగా ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకోక తప్పదు.
సిపిఎం నేతృత్వంలో ఆవిర్భవించిన ‘బహుజన వామపక్ష ఫ్రంట్’ కూటమి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తోంది కనుక దానిలో కాంగ్రెస్ చేరబోదు. కాంగ్రెస్ తో సన్నిహితంగా మెలుగుతున్న కారణంగా కోదండరాం కూడా దానిలో చేరకపోవచ్చు. దానిలో చేరితే అయన పార్టీ కాంగ్రెస్, తెరాసలను ఎదుర్కోవలసి ఉంటుంది. చేరకపోతే దానిలో ఉన్న చిన్న చిన్న పార్టీలను, తెరాసను కోదండరాం పార్టీ ఎదుర్కోవలసి ఉంటుంది. రెండు పెద్ద పార్టీలను ఎదుర్కోవడం కంటే పెద్దగా గుర్తింపులేని చిన్న పార్టీలను ఎదుర్కోవడమే సులువు కదా!
అయితే ప్రొఫెసర్ కోదండరాం మొదటి నుంచి కాంగ్రెస్ నేతలతో చాలా సన్నిహితంగా మెలుగుతున్నప్పటికీ నేరుగా దానితో పొత్తులు పెట్టుకోకపోవచ్చు. పెట్టుకొంటే ‘మేధావి ముసుగులో కాంగ్రెస్ ఏజెంట్ గా పనిచేస్తున్నారనే’ తెరాస ఆరోపణలు నిజమని దృవీకరించినట్లవుతుంది. కనుక వచ్చే ఎన్నికలలో తన పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగకుండా ఉండేవిధంగా అభ్యర్ధులను నిలబెట్టే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా పుట్టుకు వస్తున్న ఈ పార్టీలన్నీ కలిసి తెరాస ఓట్లకు గండికొడతాయో లేక అన్నిటినీ తెరాస తుడిచిపెట్టేసి మళ్ళీ అధికారం చేజిక్కించుకొంటుందో చూడాలి.