అందరికీ జస్టిస్! అందుకే పార్టీ: జస్టిస్ చంద్రకుమార్

ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు ఏ రాష్ట్రంలోనైనా కొత్త పార్టీలు, కూటములు పుట్టుకురావడం సహజం. ఇప్పటికీ సిపిఎం నేతృత్వంలో బహుజన వామపక్ష ఫ్రంట్ ఏర్పాటయింది. టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూడా రాజకీయ పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి రాబోతున్నట్లు నిన్ననే ప్రకటించారు. అదిగాక మరో కొత్త పార్టీ కూడా ఏర్పాటుకాబోతున్నట్లు నిన్ననే ప్రకటన వెలువడింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ దానిని స్థాపించబోతున్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో అందరికీ సమానావకాశాలు కల్పించడం కోసం, కులవివక్ష నిర్మూలన, నిరుపేదలందరికీ ఉచిత విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించడం తమ పార్టీ ఆశయాలని జస్టిస్ చంద్రకుమార్ చెప్పారు. 

హైదరాబాద్ లో షిర్డీసాయి నగర్ లోని తన నివాసంలో నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “స్వాతంత్ర్యం వచ్చి ఏడూ దశాబ్ధాలు గడిచినా దేశంలో, రాష్ట్రంలో బడుగు,బలహీన వర్గాలు, మైనార్టీలు, ఆదివాసీల స్థితిగతులలో ఎటువంటి మార్పు రాలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారం చెలాయిస్తున్న పార్టీలన్నీ అవినీతి, అక్రమాలను పెంచి పోషిస్తున్నాయే తప్ప రాజ్యాంగంలో బాబాసాహెబ్ సూచించినట్లుగా అందరికీ సమానావకాశాలు కల్పించడానికి ప్రయత్నించలేదు. దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. మహిళలు, గిరిజనులు, ఆదివాసీలపై దాడులు నిత్యక్రుత్యమైపోయాయి. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అందుకే ఒక కొత్త పార్టీ స్థాపించి అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలనుకొంటున్నాను. త్వరలోనే పార్టీ పేరు, వివరాలు తెలియజేస్తాను,” అన్నారు జస్టిస్ చంద్రకుమార్.