కోదండరాముడు కూడా వచ్చేస్తున్నాడు

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రాజకీయపార్టీ స్థాపించబోతున్నట్లు ఆదివారం ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంజాల్ లో నిర్వహించిన టిజెఎసి విస్తృతస్థాయి సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం ఈవిషయం ప్రకటించారు. 

ఈ సందర్భంగా అయన టిజెఎసి సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం ఎంత మొత్తుకొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మనం దేనికోసం పోరాడి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకొన్నామో ఆ ఆకాంక్షలు నెరవేరడం లేదు. ఈ మూడున్నరేళ్ళలో రాష్ట్రంలో 3,633 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. పైగా 700 మంది మాత్రమే ఆత్మహత్యలు చేసుకొన్నారని అబద్ధాలు చెపుతోంది. అందుకే తప్పనిసరి పరిస్థితులలో రాజకీయ పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి రాక తప్పడం లేదు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న తెలంగాణా రాష్ట్రాన్ని నిర్మించుకొనేందుకు అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం,” అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

ప్రొఫెసర్ కోదండరాం స్థాపించబోయే పార్టీ పేరు ‘తెలంగాణా జనసమితి,’ దాని గుర్తు రైతు-నాగలి’ అని సమాచారం.  పార్టీ పేరు, గుర్తును ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 10వ తేదీన వరంగల్ లో ఆవిర్భావ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దానిలో పార్టీ పేరు, గుర్తు, జెండా, ఆశయాలను ప్రకటిస్తారు.