గాంధీ భవన్ లో కూర్చొని విమర్శించడం కాదు...

ఈ ఏడాది జూలై 15వ తేదీ నాటికి అన్ని గ్రామాలలో ఇళ్ళకు మిషన్ భగీరథ ద్వారా తప్పకుండా మంచి నీళ్ళను అందిస్తామని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖా మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. నారాయణ్ ఖేడ్ శుక్రవారం నిర్వహించిన సభలో అయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా నిర్దిష్ట సమయంలో తన హామీని నిలబెట్టుకోకపోతే ప్రజలను ఓట్లు అడగబోమని చెప్పే సాహసం చేయలేదు కానీ మన ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం 2019లోగా ఇంటింటికీ మంచి నీళ్ళు అందించలేకపోతే ఓట్లు అడగమని శపథం చేశారు. అయితే నిర్దేశించిన గడువు కంటే ఆరు నెలల ముందుగానే అంటే జూలై 15వ తేదీలోగానే రాష్ట్రంలో గ్రామాలలో ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందించబోతున్నాము. మిషన్ కాకతీయ ద్వారా ప్రతీ ఎకరానికి నీరు అందించడానికి ప్రయత్నిస్తున్నాము. సింగూరు ప్రాజెక్టు నుంచి వరుసగా మూడవసారి నీటిని విడుదల చేశాము. అది చూసి రైతులు కళ్ళలో కనబడుతున్న ఆనందాన్ని స్వయంగా చూడవలసిందే తప్ప వర్ణించలేము. 

వ్యవసాయాభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ఇన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో కూర్చొని మాపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. వారి హయంలో ఎరువుల కోసం రైతులు పోలీస్ స్టేషన్ల ముందు క్యూ లైన్లలో నిలబడవలసి వచ్చేది. కానీ మా ప్రభుత్వం రైతు ఇంటి ముంగిటకే అన్ని అందజేసేందుకు ఏర్పాట్లు చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కనుక కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వ్యవసాయరంగంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కళ్ళకు కనబడతాయి. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా మా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తే, ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారు," అని అన్నారు.