మేడారం అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు

ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న మేడారం వచ్చి సమక్క సారలమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఊహించినట్లుగానే మేడారం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ, “మేడారం జాతర రెండేళ్ళకోసారి జరుగుతున్నప్పటికీ, వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం భక్తులు అమ్మవార్ల దర్శనానికి వస్తూనే ఉన్నారు. కనుక భక్తులకు సకల సదుపాయాలు లభించేవిధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము. ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయించాము. కానీ మేడారం అభివృద్ధికి మరింత ఎక్కువ నిధులు కేటాయించవలసి ఉందని అర్ధమయింది. ఈసారి బడ్జెట్ లో మేడారం కోసం రూ.200 కోట్లు కేటాయిస్తాము. అమ్మవారి గద్దెలున్న ప్రదేశం చాలా ఇరుకుగా ఉంది. కనుక 200-300 ఎకరాలను తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయ్యాల్సి ఉంది. మేడారం జాతర పూర్తయిన తరువాత పనులు మొదలుపెట్టిస్తాను. మళ్ళీ రెండు వారాలలోగా మేడారం వచ్చి అధికారులతో సమావేశమయ్యి దీని గురించి చర్చిస్తాను. కోటి మందికి పైగా భక్తులు వస్తున్న అతిపెద్ద జాతర ఇది. చుట్టుపక్కల 5 రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి దీనిలో పాల్గొంటారు. కనుక దీనికి జాతీయపండుగ హోదా కల్పించాలని మేము కేంద్రాన్ని కోరాము కానీ మా విజ్ఞప్తిని అది పట్టించుకోలేదు. ఈసారి నేనే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేస్తాను,” అని చెప్పారు.