టిటిడిలో ఇతర మతస్తులు హైకోర్టులో పిటిషన్




తిరుమలలో అనేక వేలమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 42 మంది ముస్లిం, క్రీస్టియన్ మతాలకు చెందిన ఉద్యోగులున్నారు. వారందరూ చిరకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో విధులు నిర్వహిస్తున్నారు. వారెవరివల్ల ఆలయ సంప్రదాయాలకు, కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడలేదు. కానీ డిప్యూటీ ఈవో స్నేహలత వివాదాస్పద వ్యవహారశైలి కారణంగా మిగిలిన 41 మందికి ఊహించని ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తోందిప్పుడు. స్నేహలత వివాదస్పద వైఖరిపై కొందరు హిందూమత సంఘాలు, పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఆమెతో సహా తిరుమలలో పనిచేస్తున్న ఇతర మతస్తులు అందరినీ తక్షణమే విధులలో నుంచి తప్పించాలని ఒత్తిడి చేయడంతో టిటిడి వారందరికీ నోటీసులు జారీ చేసింది. 

టిటిడి తమను విధులలో నుంచి తొలగించడం సరికాదంటూ వారందరూ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. మిగిలిన మతస్తులు అందరూ ఏవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలలో చేరుతారో తాము కూడా అదే పద్దతిలో పరీక్షలు వ్రాశామని, ఈ ఉద్యోగాలలో చేరే ముందు తమను ఇంటర్వ్యూ చేసిన అధికారులకు తాము ఇతర మతస్తులమని తెలుసునని, వారు తమ సర్టిఫికెట్లను కూడా పరిశీలించి ఆ విషయం దృవీకరించుకొన్న తరువాతే సంబంధిత అధికారులు తమను ఈ ఉద్యోగాలకు ఎంపికచేసుకొన్నారని వారు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. చట్టబద్దంగా ఉద్యోగాలను పొందిన తమను కొందరి ఒత్తిళ్లకు తలొగ్గి ఉద్యోగాలలో నుంచి తొలగించడం అన్యాయమని, కనుక టిటిడిని తన నిర్ణయం ఉపసంహరింపజేసుకోమని ఆదేశించాలని వారు తమ పిటిషన్ లో కోరారు. ఈ కేసులో ఏపి రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శిని, టిటిడి ఈవోను ప్రతివాదులుగా వారు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.