నేడు మేడారం జాతరకు సిఎం కెసిఆర్

ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు మేడారం జాతరకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి 1.15కు మేడారం చేరుకొంటారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిదిలో కాసేపు విశ్రాంతి తీసుకొని, 1.45 గంటలకు సమక్క సారలమ్మల దర్శనానికి వెళతారు. అక్కడ పూజలు ముగిసిన తరువాత తులాభారం తూగి అమ్మవార్లకు బెల్లం సమర్పించుకొంటారు. మధ్యాహ్నం 3.10 గంటలకు హెలికాఫ్టర్ లో మళ్ళీ హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు. కెసిఆర్ ముఖ్యమంత్రి హోదాలో మేడారం జాతరకు హాజరవడం ఇదే మొదటిసారి. అయితే తన రాకతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో గద్దెల వద్ద ఎక్కువసేపు గడపకుండా అమ్మవార్ల దర్శనం చేసుకొని వచ్చేస్తారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మేడారం జాతరకు వచ్చినప్పుడు మేడారం అభివృద్ధికి వరాలు ప్రకటిస్తారని స్థానిక ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారు.