రాష్ట్రంలో హోంగార్డులకు జీతాలు పెంచుతామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకొంటూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డులకు రోజుకు రూ.400 నుంచి రూ.675లకు పెంచుతున్నట్లు ఉత్తర్వులలో పేర్కొంది. పెరిగిన జీతాలు ఈ నెల నుంచే అందుకొంటారు. ఇక నుంచి పోలీస్ ఉద్యోగుల మాదిరిగానే ప్రతీ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన రూ.1,000 జీతం పెంచబోతున్నట్లు పేర్కొంది. కనుక ఈ నెల నుంచి రాష్ట్రంలో హోంగార్డులు రూ.20,250 జీతం అందుకోబోతున్నారు.
అంతేగాక పోలీసులకు ఇస్తున్నట్లుగానే యూనిఫాం అలవెన్సు, బందోబస్తు అలవెన్సు, ట్రాఫిక్ విభాగంలో పనిచేసేవారికి రోజుకు రూ.30 పొల్యూషన్ అలవెన్స్, మహిళా హోంగార్డులకు 6 నెలలు ప్రసూతీ శలవు, పురుష హోంగార్డులకు 15 రోజులు పితృత్వ శలవు మొదలైనవన్నీ లభిస్తాయి. హోంగార్డులకు వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించింది. అలాగే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళలో కొంత కోటా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హోంగార్డులు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే, వారి అంత్యక్రియల నిమిత్తం ప్రభుత్వం రూ.5,000 చెల్లిస్తోంది. ఆ మొత్తాన్ని రూ.10,000 కు పెంచింది.
ఇన్ని దశాబ్దాలుగా హోంగార్డు ఉద్యోగం అంటే వెట్టిచాకిరీ అనే భావన ఉండేది కానీ వారికీ పోలీసులతో సమానంగా జీతాలు పెంచి అలవెన్సులు కల్పించడంతో ఆ ఉద్యోగాలకు కూడా ఇప్పుడు చాలా పోటీ పెరిగే అవకాశం ఉంది. జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో హోంగార్డుల కుటుంబాలలో ఆనందం వెల్లివిరుస్తోంది. చట్టాలు, నియమనిబంధనలకే పరిమితమైన పరిపాలనకు మానవతాదృక్పధం జోడిస్తే ఏమేమి చేయవచ్చో ముఖ్యమంత్రి కెసిఆర్ చేసి చూపిస్తున్నారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేద్దామా?