నేడు జాతిపిత మహాత్మాగాంధీ 70వ వర్దంతి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు తదితరులు డిల్లీలో రాజ్ ఘాట్ వద్ద జాతిపితకు నివాళులు అర్పించారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికార ప్రతిపక్ష నేతలు జాతిపితకు నివాళులు అర్పిస్తున్నారు.
యావత్ దేశ ప్రజలను ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చి అహింసామార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహాత్మగాంధీ, ఆ తరువాత ఏనాడూ అధికారం కోసం అర్రులు చాచలేదు. అలాగే ఏనాడూ ఆడంబరంగా జీవించాలనుకోలేదు. స్వయంగా చీపురుపట్టి ఆశ్రమం ఊడ్చేవారు. నిజమైన నాయకుడు ఏవిధంగా జీవించాలో ఆచరణలో చేసి చూపారు. నేటి పరిస్థితులలో మన మంత్రులు, ప్రజాప్రతినిధులు అంత నిరాడంబరంగా జీవించాలని ప్రజలు కూడా కోరుకోవడం లేదు కానీ ప్రజలకు దండాలు పెట్టి అధికారంలోకి వచ్చినవారు అదే ప్రజల పట్ల తృణీకారభావంతో...అహంకారపూరితంగా వ్యవహరించడం సరికాదని భావిస్తున్నారు. మన నేతలందరూ మహాత్ముడి ఆశయాలకు, ఆయన చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ నేడు మహాత్ముడికి ఘనంగా నివాళులు అర్పిస్తుండటం విశేషం.