జగన్@1,000 కిమీ

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన ‘ప్రజా సంకల్ప పాదయాత్ర’కు ముందు ఏపి తెదేపా నేతలు ఎన్ని తుమ్ములు తుమ్మినా, అడుగడుగునా ఎన్ని విమర్శలు చేస్తున్నా సోమవారం అయన తన సుదీర్గ పాదయాత్రలో 1,000 కిమీ మైలురాయి చేరుకొన్నారు. అందుకు గుర్తుగా ఈరోజు నెల్లూరు జిల్లాలో సైదాపురం గ్రామంలో పైలాన్ ఆవిష్కరించారు.

జగన్మోహన్ రెడ్డి గత ఏడాది నవంబర్ 6వ తేదీన ఇడుపలపాయ నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. ఆరు నెలలపాటు ఏకధాటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాలలో కలిపి 3,000 కిమీ పాదయాత్ర చేయబోతున్నారు. ఈ సందర్భంగా అయనకు అడుగడుగునా ప్రజలు నీరాజానాలు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సాగుతున్న తెదేపా సర్కార్ అవినీతిని, అసమర్ధతను ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అదేసమయంలో తను అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఏమేమీ పధకాలు అమలుచేయాలనుకొంటున్నారో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టిన కొత్తలో కాళ్ళనొప్పులు, కాళ్ళకు పుండ్లు ఏర్పడటంతో కొంచెం బాధపడ్డారు. అలాగే ప్రతీ శుక్రవారం కోర్టు విచారణకు కూడా హాజరుకాక తప్పనిసరి పరిస్థితి. కనుక ఆయన ఎన్నో రోజులు పాదయాత్ర చేయలేరని తెదేపా నేతలు చాలా సంతోషపడ్డారు. కానీ వారిది అల్పసంతోషమేనని తేల్చి పడేస్తూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు 1,000 కిమీ మైలురాయి చేరుకొన్నారు. కనుక మిగలిన 2,000 కిమీ కూడా అయన అవలీలగా పూర్తి చేయబోతున్నారని స్పష్టం అయ్యింది. 

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా చేస్తున్న ఈ పాదయాత్ర ప్రభావం ఏపి రాష్ట్ర ప్రజలపై ఏమేరకు ఉంటుంది? ఈ పాదయాత్రతో వచ్చే ఎన్నికలలో వైకాపా విజయం సాధించి అధికారం చేజిక్కించుకోగలదా లేదా? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలు, అవినీతి ఆరోపణల కారణంగా తమ ప్రభుత్వంపై ప్రజలలో పెరిగే వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు ఏవిధంగా ఎదుర్కొంటారు? వచ్చే ఎన్నికలలో తెదేపాను ఏవిధంగా గెలిపించుకొంటారు? అనే ప్రశ్నలన్నిటికీ వచ్చే ఎన్నికలలోగానే సమాధానాలు లభించవచ్చు.