నల్లగొండ కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి చేస్తున్న తీవ్ర ఆరోపణలపై తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. “కోమటిరెడ్డి సోదరులకు మా పార్టీపై, ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం దురలవాటుగా మారిపోయింది. వాస్తవానికి శ్రీనివాస్ రెడ్డితో మా తెరాస వాళ్ళకు ఎటువంటి విభేదాలు శత్రుత్వం లేదు. తెరాస ఎమ్మెల్యే వీరేశంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇరువర్గాల మద్య కొట్లాటలో జరిగిన హత్యను తెరాసకు ఆపాదించడం, దానిని రాజకీయ హత్యగా అభివర్ణిస్తూ కోమటిరెడ్డి సోదరులు శవరాజకీయాలు చేస్తున్నారు. ఒక స్ట్రీట్ ఫైట్ ను స్టేట్ ఫైట్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు,” అని అన్నారు.
ఒక రాజకీయ హత్యను స్ట్రీట్ ఫైట్ హత్యగా చూపించి దోషులను, సూత్రధారులను కాపాడాలని తెరాస సర్కార్ ప్రయత్నిస్తోందని కోమటిరెడ్డి సోదరులు ఆరోపిస్తుంటే, ఒక స్ట్రీట్ ఫైట్ ను స్టేట్ ఫైట్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెరాస నేత ఆరోపించడం విచిత్రంగానే ఉంది. శ్రీనివాస్ హత్యకు కారణం ఏదైనప్పటికీ దోషులను తక్షణమే న్యాయస్థానం ముందు నిలబెట్టవలసిన అవసరముంది.