గణతంత్రదినోత్సవం సందర్భంగా ఈసారి కేంద్రప్రభుత్వం దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 85 మంది ప్రముఖులకు ప్రతిష్టాత్మకమైన ‘పద్మ’ అవార్డులను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం 24 మంది పేర్లను సిఫార్సు చేసింది. మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావుకు భారతరత్న, తెలంగాణా సిద్దాంతకర్త జయశంకర్, ఆర్ధికవేత్త చెన్నమనేని హనుమంతరావు, ప్రముఖ సాహిత్యకారుడు శివ క్ కుమార్ ల పేర్లను పద్మ విభూషణ్ అవార్డులకు సిఫార్సు చేసింది . అలాగే పివి సింధు, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, అందెశ్రీ , చుక్కా రామయ్య తదితరాల పేర్లను పద్మ అవార్డులకు సిఫార్సు చేసింది.
ఈసారి అర్హులైన వ్యక్తులు వారంతట వారే పద్మ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కేంద్రప్రభుత్వం అవకాశం కల్పించడంతో మరో 15 మంది దరఖాస్తు చేసుకొన్నారు. కానీ తెలంగాణా రాష్ట్రానికి ఈసారి ఒక్క అవార్డు కూడా దక్కలేదు. ఈసారి గణతంత్రదినోత్సవ వేడుకలలో ‘సమక్క సారలమ్మ అమ్మవార్ల మేడారం జాతర’ ప్రాశస్త్యం తెలియజేసే శకటాన్ని తెలంగాణా ప్రభుత్వం ప్రదర్శించాలనుకొంది. కానీ శకటాల ఎంపిక కమిటీ దానిని రెండవదశలో తిరస్కరించడంతో వరుసగా రెండవ ఏడాది గణతంత్రదినోత్సవ వేడుకలలో తెలంగాణా రాష్ట్రం తరపున శకటానికి అవకాశం దక్కలేదు.