
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన ‘టాక్సిక్’ సినిమాకు కలెక్షన్స్ భాగానే ఉన్నా, అటువంటి సినిమా చేసినందుకు యష్ విపరీతంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో టాక్సిక్ కోసం ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడేందుకు కూడా నటీనటులు, దర్శక నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న యష్‌కి మద్దతుగా ప్రముఖ కన్నడ నటులు రిషబ్ శెట్టి, కిచ్చా సుదీప్, ఉపేంద్ర ముందుకు వచ్చారు.
ఒక నటుడుగా ప్రతీ పాత్రకి ప్రాణం పోసేందుకు ప్రయత్నిస్తాము. టాక్సిక్‌లో యష్ కూడా అదే చేశారు. ఈ సినిమా కథ, పాత్రలు రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాగడం తప్పు పట్టలేము. ఓ ఆలోచనని సినిమాగా మలిచేందుకు అనేకమంది శ్రమిస్తారు. వారి శ్రమను, నిబద్దతను అందరూ గౌరవించాలి.
కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళేందుకు టాక్సిక్ చిత్ర బృందం గట్టి ప్రయత్నం చేసింది. ఇలాంటి సాహసోపేతమైన ప్రయోగం చేసినందుకు నేను యష్‌ని చాలా గౌరవిస్తాను,” అని రిషబ్ శెట్టి అన్నారు.
సుదీప్, ఉపేంద్ర కూడా టాక్సిక్ కోసం యష్ ఎంతగానో కష్టపడ్డారని, దానిని తాము గుర్తించి గౌరవిస్తున్నామన్నారు. ఈ కష్టకాలంలో ఇలాంటి ఓదార్పులు అవసరమే. అవి ఈ బాధల నుంచి తేరుకొని ముందుకు సాగడానికి పనికి వస్తాయి. కానీ యష్ సినీ ప్రస్తానంలో ఈ టాక్సిక్ ఎఫెక్ట్ ఎప్పటికీ నిలిచిపోతుంది.
కానీ ఇక ముందు సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ టాక్సిక్ యష్‌కి బాగా ఉపయోగపడుతుందని మాత్రం చెప్పవచ్చు.