సినిమా ఛాన్స్ కావాలంటే కమిట్ అవ్వాల్సిందేనట!

సినీ పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ అంటూ అందమైన ముసుగు వేసినప్పటికీ, తెర వెనుక జరిగేది ఓ రకమైన వ్యభిచారమే అని అందరికీ తెలుసు. సినిమాలలో అవకాశాల కోసం వచ్చిన యువతులు, మహిళలను పురుష పుంగవులు నయాన్నో, భయాన్నో లొంగదీసుకుంటూనే ఉన్నారని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.  

తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా ఇదే చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ లేదా యూట్యూబ్‌లో వీడియోలు చూసి సీరియల్స్, సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్‌లో అవకాశాలు ఇస్తామని ఎవరైనా సంప్రదిస్తే గుడ్డిగా నమ్మి వెళ్ళవద్దని ఆమె సూచించారు.

తనకు ఒకసారి టీవీ సీరియల్లో, మరోసారి సినిమాలో నటించే అవకాశం కల్పిస్తామని ఫోన్లు చేస్తే ఎంతో ఆశతో హైదరాబాద్‌ వస్తే కమిట్ అవ్వాలని చెప్పారన్నారు. ఇటీవల ఫోక్ సాంగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తామని ఫోన్ రావడంతో, కనీసం అలాగైన చిన్న అవకాశం లభిస్తుంది కదా అనే ఆశతో మళ్ళీ హైదరాబాద్‌ వచ్చానని చెప్పారు. కానీ అక్కడ కూడా మళ్ళీ అదే చేదు అనుభవం ఎదురవడంతో విజయవాడ తిరిగి వెళ్ళిపోతున్నానని ఆమె చెప్పారు. 

సినీ పరిశ్రమలో అవకాశాల కోసం కమిట్‌మెంట్ కోరే పరిస్థితులు ఉన్నాయని, టాలెంట్ ఒక్కటే సరిపోదని ఆమె అన్నారు. సినీ పరిశ్రమలో ‘కమిట్’ అవకుండా నిలద్రోక్కుకోవడం అసంభవమని కనుక యువతులు ఎవరూ గుడ్డిగా నమ్మి హైదరాబాద్‌ వెళ్ళవద్దని ఆమె అన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.