రజనీ సినిమాలో రాశీఖన్నాకి గోల్డెన్ ఛాన్స్

తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన రాశీఖన్నా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేసినప్పటికీ ‘స్టార్ హీరోయిన్’ స్థాయికి చేరుకోలేకపోయింది. 

దీంతో బాలీవుడ్, ఓటీటీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన రాశీఖన్నా అక్కడ కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ దక్షిణాదిలో సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉంది.

ఇన్నాళ్ళకు ఆమెకు అటువంటి గొప్ప అవకాశం లభించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘ధర్మన్’లో ఆమెకు ఓ ముఖ్యమైన పాత్ర లభించింది. రజనీకాంత్ వంటి అగ్ర నటుడి సినిమాలో అవకాశం దక్కడం ఆమెకు గోల్డెన్ ఛాన్స్‌ అనే చెప్పవచ్చు. 

అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తీయబోతున్న ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు కమల్ హాసన్ చేపట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా రజనీకాంత్ సినిమాల సక్సస్ రేట్ బాగానే ఉంటుంది. ఇది కూడా రాశీఖన్నాకు కలిసివచ్చేదే. ఈ సినిమాలో రజనీకాంత్‌కి జోడీగా సిమ్రాన్ నటిస్తున్నట్లు సమాచారం.