
తెలుగులో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు వస్తున్నా వాటిలో ఏది బాగుంటే వాటిని మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అది చిన్న సినిమానా లేక భారీ బడ్జెట్‌తో తీసిన పెద్ద హీరో సినిమానా? అని కాక సినిమా బాగుంటే చాలు ఆదరిస్తుంటారు. కనుక కొత్త రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులతో చిన్న సినిమాలు వస్తూనే ఉన్నాయి.
అటువంటిదే ‘23’. మల్లేశం, 8 ఏఎం మెట్రో వంటి చక్కటి సినిమాలతో మెప్పించిన రాజ్ ఆర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో జాన్సీ, తేజ, తన్మయి, పవన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
1991లో జరిగిన చుండూరులో దళితుల ఊచకోత, 1993లో చిలకలూరిపేటలో బస్సులో సజీవదహనం, 1997 జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. సమాజంలో అట్టడుగు వర్గాలపై గతంలో జరిగిన ఈ దాడులు, ఇంకా జరుగుతున్న దాడులు, అణచివేతని కధాంశంగా తీసుకొని ఈ సినిమా తీసిననట్లు ఈరోజు విడుదలైన టీజర్ చూస్తే అర్దమవుతుంది.
చట్టం ముందు అందరూ సమానమే.. అందరికీ ఓకేలా చట్టం వర్తిస్తుంది.. వంటి డైలాగ్స్ మన రాజకీయ నాయకుల నోట రోజూ వింటూనే ఉంటాము. కానీ మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా? అంటూ దర్శకుడు రాజ్ ప్రశ్నిస్తున్నారు. వర్తించదని ఈ సినిమాతో చూపించబోతున్నారు.
ఈ సినిమాకి సంగీతం: మార్క్ కే రాబిన్, కెమెరా: సన్నీ కూరపాటి, డైలాగ్స్: ఇండస్ మార్టిన్, పాటలు: చంద్రబోస్, రహమాన్, ఇండస్ మార్టిన్, ఎడిటింగ్: అనిల్ ఆలయం, ఆర్ట్: విష్ణువర్ధన్ పుల్ల చేశారు.
స్టూడియో 99 బ్యానర్‌పై తీసిన ఈ సినిమాని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా త్వరలో విడుదల చేయబోతోంది.