
రామ్ జగదీష్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని సమర్పణలో నిర్మించిన సినిమా ‘కోర్ట్: స్టేట్‌మెంట్ వర్సస్ ఏ నో బడీ’ ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధానపాత్ర చేయగా, హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. సాయి కుమార్, శివాజీ, రోహిణి, హర్షవర్ధన్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాని, “ఓ సినిమా కధ, పాత్రలతో ప్రేక్షకులు కూడా లీనమైపోయి నవ్వుతూ, బాధపడుతూ, కన్నీళ్ళు పెట్టుకుంటూ చూసే సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. అటువంటి అనుభూతిని ఈ కోర్ట్ సినిమాతో నేను పొందాను. తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన కోర్టు డ్రామా సినిమాలలో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.
కనుక ప్రేక్షకులు కూడా మార్చి 14న థియేటర్లకు వెళ్ళి ఈ సినిమా చూడామని నేను అభ్యర్ధిస్తున్నాను. నేను ఈ 16 ఏళ్ళలో ఎన్నడూ నా సినిమా చూడమని ఇలా అభ్యర్ధించలేదు. తొలిసారిగా మీ అందరినీ అడుగుతున్నాను. మార్చి 14వరకే నేను మీకు నా ఈ సినిమా గురించి గుర్తుచేస్తుంటాను. ఆ తర్వాత సినిమా చూసి మీరే సినిమా అద్భుతంగా ఉంది తప్పక చూడమని అందరికీ చెపుతారు. ఈ సినిమాపై అంత నమ్మకం ఉంది. ఒకవేళ మీకు ఈ సినిమా నచ్చకపోతే మరో రెండు నెలల్లో విడుదల కాబోతున్న నా హిట్-3 సినిమా చూడొద్దు. ఎందుకంటే ఈ సినిమా కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి అది తీశాను,” అని అన్నారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కోర్ట్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు నాగ్ అశ్విన్, ఇంద్రగంటి మోహనకృష్ణ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, ప్రశాంత్ ప్రశాంత్ వర్మ, శౌర్యువ్ తదితరులు హాజరయ్యారు.