నా భర్తతో ఎటువంటి గొడవలు లేవు: కల్పన

రెండు రోజుల క్రితం నిద్రమాత్రలు అధికమోతాదులో తీసుకొని అపస్మారక స్థితిలో హోలిస్టిక్ హాస్పిటల్లో చేరిన సినీ గాయని కల్పన, పూర్తిగా కొలుకోవడంతో మీడియాలో తన గురించి, తన కుటుంబం గురించి వస్తున్న వార్తలని ఖండిస్తూ ఓ వీడియో మెసేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

దానిలో ఆమె “నాకు నా భర్తకు ఎటువంటి విభేధాలు లేదు. నాకు ఇప్పుడు 45 ఏళ్ళు. ఈ వయసులో నేను ఎల్ఎల్‌బీ, పీహెచ్‌డీ చేస్తున్నాను. మరోపక్క సినిమాలలో పాటలు పాడుతుంటాను. ఒకేసారి ఇన్ని వ్యాపకాలు పెట్టుకోవడంతో ఒత్తిడి పెరిగిపోయి చాలా ఏళ్ళుగా రాత్రుళ్ళు సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. కనుక డాక్టర్ సలహా మేరకు నిద్ర మాత్రలు వాడుతున్నాను.

 కానీ మొన్న పొరపాటున కాస్త ఓవర్ డోస్ వేసుకోవడం వలన అపస్మారకస్థితిలోకి జారుకున్నాను. కానీ చెన్నైలో ఉన్న నా భర్తకు ఈవిషయం ఫోన్ చేసి చెప్పడంతో ఆయన వెంటనే కాలనీవాసులను అప్రమత్తం చేసి నన్ను సకాలంలో హాస్పిటల్లో చేర్పించారు. నాకు సాయపడిన నా భర్తకు, మా కాలనీవాసులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

నేను నా భర్త, కుమార్తె ముగ్గురం చాలా సంతోషంగా జీవిస్తున్నాము. మా మద్య ఎటువంటి గోడవలూ లేవు. మాకు ఎటువంటి సమస్యలు లేవు. కానీ భర్తతో విభేధాల కారణంగా నేను ఆత్మహత్యాయత్నం చేశానని వార్తలు చూసి వాటిని ఖండించేందుకు ఈ వీడియో రిలీజ్‌ చేస్తున్నాను. మీడియా మిత్రులందరూ మా కుటుంబ విషయంలో దయచేసి సంయమనం పాటించాలి,” అని కల్పన విజ్ఞప్తి చేశారు.