వేణు సినిమా లోకల్.. సంగీతం నాన్ లోకల్!

హాస్యనటుడుగా కాలక్షేపం చేస్తున్న వేణు ఎల్దండి హటాత్తుగా దర్శకుడుగా మారి బలగం వంటి చక్కటి చిత్రం తీసి అందరి ప్రశంశలు అందుకున్నారు. ఆ సినిమా విడుదలై రెండేళ్ళవుతున్నా ఇంకా తన కొత్త సినిమా ‘ఎల్లమ్మ’ షూటింగ్‌ మొదలుపెట్టనే లేదు. 

ఈ సినిమాలో యువహీరో నితిన్ ప్రధాన పాత్ర చేయబోతున్నారు. హీరోయిన్‌ పాత్ర సాయి పల్లవి చేస్తే బాగుంటుందని వేణు ఎల్దండి కోరుకుంటున్నా ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నారు. కనుక వేరే హీరోయిన్‌తో లాగించేస్తారా లేదా ఆమె డేట్స్ దొరికేవరకు మిగిలిన నటీనటులతో సన్నివేశాలు ఘాట్ చేస్తూ వేచి చూస్తారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

‘బలగం’ సినిమాలాగే ‘ఎల్లమ్మ’ సినిమా కూడా తెలంగాణ గ్రామీణ నేపధ్యంతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిభింబించే సినిమా అని వేరే చెప్పక్కరలేదు. అయితే ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శక ద్వయం అజయ్, అతుల్‌ని దించుతున్నారు వేణు ఎల్దండి. వారు ఇప్పటికే ‘ఎల్లమ్మ’ సినిమా వర్క్ మొదలుపెట్టేశారు కూడా.

 ప్రస్తుతం నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమాతో ఉన్నారు. ఇది మార్చి 28 న విడుదలకాబోతోంది. ఆ తర్వాత నితిన్ ఫ్రీ అయిపోతారు కనుక వెంటనే ‘ఎల్లమ్మ’ పూజా కార్యక్రమం జరిపి, ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభించడానికి వేణు ఎల్దండి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు.