కుబేర టైటిల్‌ మాదే: నిర్మాత నరేందర్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రలలో ‘కుబేర’ సిద్దం చేస్తున్న సంగతి తెలిసిందే. అంత సజావుగా సాగుతోందనుకుంటే, టైటిల్‌ రైట్స్ వివాదంలో చిక్కుకుంది.

త్రిశక్తి ఎంటర్‌ప్రైజస్ అధినేత, నిర్మాత నరేందర్ మంగళవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వివాదం గురించి మాట్లాడారు. తాను 2023, నవంబర్‌ 29న నిర్మాతల మండలిలో ‘కుబేర’ టైటిల్‌ రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని తెలియజేశారు.

కానీ దర్శకుడు శేఖర్ కమ్ముల 2024, మార్చి 5న కుబేర అనే టైటిల్‌ ముందు తన పేరు జోడించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఆయన వంటి దర్శకుడు ఈవిదంగా కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడటం సరికాదన్నారు నిర్మాత నరేందర్.

తాను నిర్మాతల మండలి పెద్దలను కలిసి దీని గురించి అడిగితే, “వాళ్ళు చాలా పెద్దవాళ్ళు.. వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకుంటావు? సర్దుకు పో, ” అని ఓ ఉచిత సలహా ఇచ్చారు తప్ప శేఖర్ కమ్ములకి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని నిర్మాత నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకవేళ నిర్మాతల మండలి తనకు న్యాయం చేయకపోతే దీని కోసం న్యాయపోరాటం చేస్తానని నిర్మాత నరేందర్ స్పష్టం చేశారు. 

కుబేరా సినిమాకి కధ, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు. 

శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.