హైకోర్టు కాదని చెప్పినా ఈడీ జప్తు.. వెరీ బ్యాడ్: శంకర్

రోబో సినిమా కాపీ రైట్ కేసులో ఆ సినిమా దర్శకుడు శంకర్‌కు చెందిన రూ.10 కోట్లు విలువగా మూడు ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. దానిపై శంకర్‌ స్పందిస్తూ, “రోబో (తమిళంలో ఎంథిరన్) సినిమా కాపీరైట్ వివాదం ఏమీ లేదని మద్రాసు హైకోర్టు తీర్పు చెపుతూ పిటిషనర్‌ వేసిన కేసును కొట్టేసింది.

కానీ హైకోర్టు తీర్పుని పట్టించుకోకుండా ఫిల్మ్ అండ్ టీవీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికని మాత్రమే పరిగణనలోకి తీసుకొని నా ఆస్తులను జప్తు చేయడం సరికాదు. ఇది కోర్టు తీర్పుని ఆక్షేపించిన్నట్లే భావిస్తున్నాను. ఈడీ తొందరపాటుతో తీసుకున్న ఈ చర్య నన్ను ఎంతగానో బాధిస్తోంది. దీనిపై న్యాయపోరాటం చేసి నా నిజాయితీ నిరూపించుకుంటాను,” అని దర్శకుడు శంకర్‌ అన్నారు. 

ఆరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి ఈ కేసు వేశారు. తాను వ్రాసిన జిగుబా అనే కధని దర్శకుడు శంకర్‌ కాపీ కొట్టి ‘ఎంథిరన్’ పేరుతో సినిమా తీశారని, ఇది కాపీరైట్ చట్టం ఉల్లంఘన కిందే వస్తుందని మద్రాస్ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ కొట్టేసింది. కనుక ‘ఎంథిరన్’ కాపీరైట్ ఉల్లంఘన కాదని తేల్చి చెప్పింది. కనుక ఈడీ చర్యని దర్శకుడు శంకర్‌ తప్పు పట్టారు.