
పవన్ కళ్యాణ్ ప్రధానపాత్రలో చారిత్రిక నేపధ్యంతో తీస్తున్న హరిహర వీరమల్లు సినిమాకి సంబందించి మరో అప్‌డేట్ వచ్చింది. ఈరోజు వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాలో కొల్లగొట్టినాదిరో.. అంటూ సాగే రెండో పాట ఈనెల 24 మద్యాహ్నం 3 గంటలకు విడుదల కాబోతోందని ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. వారిద్దరి మద్య సాగే రొమాంటిక్ సాంగ్ ఇదని పోస్టర్‌తో చెప్పేశారు.
ఈరోజు విడుదల చేసిన పోస్టర్లో కూడా ఎప్పటిలాగే హరిహర వీరమల్లు పార్ట్-1, స్వో ర్డ్ వెర్సస్ స్పిరిట్ అని పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తుంది. హరిహర వీరమల్లు-1 పూర్తిచేయడానికే పవన్ కళ్యాణ్ మూడేళ్ళు సమయం తీసుకున్నారు. అతి కష్టం మీద సమయం కేటాయించి దీనిని పూర్తిచేస్తున్నారు. మరో రెండో భాగం ఎప్పుడు మొదలుపెడతారు? ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎలా పూర్తిచేస్తారు? అనే సందేహాలు కలుగక మానవు.
సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో దర్శకుడు క్రిష్ వేరే సినిమాకి షిఫ్ట్ అయిపోవడంతో ఆయన స్థానంలో జ్యోతీ కృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు పూర్తవుతోంది.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఇంకా విక్రమ్ జీత్, జిష్ణుసేన్ గుప్తా, నోరాహి ఫతేహి, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్.
హరిహర వీరమల్లు మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.