తమ్ముడు, బద్రి, జానీ, లక్ష్మీ, యోగి వంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు, నేపద్య గాయకుడు రమణ గోగుల గత 11 ఏళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
వ్యాపార రంగంలో స్థిరపడిన ఆయన మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’లో ఓ పాట పాడుతున్నారట. ఈవిషయం దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా తెలియజేశారు.
సుమారు 18 ఏళ్ళ క్రితం విడుదలైన లక్ష్మి సినిమాలో వెంకటేష్, రమణ గోగుల కలిసి పనిచేశారు. మళ్ళీ ఇన్నేళ్ళకు ఆయన సినిమా కోసం ఓ పాట పడేందుకు ఒప్పుకున్నారు.
ఈ ముక్కోణపు క్రైమ్ ధ్రిల్లర్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. డబ్బింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. జనవరిలో సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల కాబోతోంది.