నిర్మాత చిట్టిబాబు నటి సమంత అనారోగ్యం అంతా ఓ నాటకమని, తన సినిమాల ప్రమోషన్స్ కోసం ఉత్తుత్తి ఏడుపులు ఏడుస్తూ నాటకాలు ఆడుతోందని తీవ్ర విమర్శలు చేశారు. కానీ సినిమా బాగోనప్పుడు ఆమె ఏడ్చినా ప్రయోజనం ఉండదన్నారు. ఇంత అందవిహీనంగా ఉన్న ఆమెను శాకుంతలం సినిమాలో ఎందుకు తీసుకొన్నారో?అంటూ ఎద్దేవా చేశారు. శాకుంతలం సినిమాతో ఆమె పనైపోయిందని ఇక ఆమెను ఎవరూ సినిమాలలో తీసుకోరని జోస్యం చెప్పారు.
చిట్టిబాబు విమర్శలపై సమంత కూడా ధీటుగానే స్పందించింది. ఆయన పేరు ప్రస్తావించకుండా ఆయన చెవులలో దట్టంగా పెరిగే వెంట్రుకల గురించి ప్రస్తావిస్తూ, “జనాలకి చెవిలో ఎందుకు వెంట్రుకలు మొలుస్తాయని గూగుల్లో వెతికితే, టెస్టోస్టిరాన్ అధికంగా ఉత్పత్తి అవుతుండటం వలన అని చూపింది,” అని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టింది.
తన చెవిలో వెంట్రుకల గురించి సమంత చేసిన ఈ కామెంట్స్ పై నిర్మాత చిట్టిబాబు వెంటనే స్పందిస్తూ, “ఆమె నా పేరు ఎట్టలేదు గాబట్టి నేను ఆమె పేరు ఎత్తను. ఇది తెలివైన సమాధానం అనుకొంటున్నట్లున్నారు. అదే... నేను మాట్లాడటం మొదలుపెడితే ఆమె తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలీదు. ఆమె పరువు పోతుంది. నా చెవిలో వెంట్రుకల గురించి మాట్లాడేబదులు, నేను చెప్పిన మాటలలో నిజాయితీ ఉందా లేదా? అని మాట్లాడి ఉంటే బాగుండేది,” అని అన్నారు.