
కరోనా టైం లో ఎన్నో సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రజలకు నేనున్నా అని చాటిచెప్పిన రియల్ హీరో సోనూ సూద్.. తెలంగాణా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కే.టి.ఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల పట్ల అభినందనలు తెలియచేశారు కే.టి.ఆర్. దేశవ్యాప్తంగా నలుమూలల నుండి వస్తున్న విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు సోనూ సూద్ స్పందించి పనిచేసిన తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోనూ సూద్ తన సేవా కార్యక్రమాలకు సంబందించిన వివరాలను.. భవిష్యత్తు ప్రణాళికలు మంత్రితో పంచుకున్నారు. తన తల్లి స్పూర్తితోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు సోనూ సూద్.
అంతేకాదు హైదరాబాద్ తో తనకున్న అనుబంధాన్ని కే.టి.ఆర్ తో పంచుకున్నారు. యువ రాజకీయ నాయకుడిగా తెలంగాణాకి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంలో కీలక పాత్ర వహిస్తూ.. వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి వారి అవసరాలకు స్పందిస్తున్న కే.టి.ఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం అని సోనూ సూద్ అన్నారు. సోనూ సూద్ చేస్తున్న సేవ కార్యక్రమాలకు అభినందనగా శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందచేశారు కే.టి.ఆర్.