
అభిమాన హీరో మీద ఉన్న ప్రేమ ఒక్కోసారి ఎలాంటి పనులైనా చేసేలా చేస్తుంది. హీరో పేరుతో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటుగా ఒక్కోసారి సాహస యాత్రలు కొనసాగిస్తారు. ఈమధ్యనే సోనూ సూద్ కోసం ఓ తెలంగాణా యువకుడు పాదయాత్ర చేసి ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. అంతకుముందు అల్లు అర్జున్ కోసం కూడా ఒక అభిమాని ఇలా చేశాడు. ఇక లేటెస్ట్ గా రాం చరణ్ కోసం ముగ్గురు అభిమానులు 231 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. అలంపూర్ జోగులాంబకు చెందిన సంధ్య జయరాజ్, రవి, వీరేష్ లు తమ అభిమాన హీరో రాం చరణ్ ను కలవాలని అనుకున్నారు. జోగులాంబ జిల్లా నుండి నాలుగు రోజుల్లో హైదరాబాద్ చేరుకున్నారు.
231 కిలోమీటర్లు నడిచి శుక్రవారం మధ్యాహ్నం చరణ్ ను కలిశారు. వారిని చూసిన రాం చరణ్ ఫిదా అయ్యారు. వారిని ఆత్మీయ ఆలింగనం చేసుకుని కాసేపు వారితో ముచ్చటించారు. ఆ ముగ్గురితో సెల్ఫీ దిగారు. చరణ్ తో ఈ ముగ్గురు ఫ్యాన్స్ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.