పాతబస్తీకి మెట్రో ఉండదేమో?

నాగోల్- అమీర్ పేట-మియాపూర్ మద్య మెట్రో రైల్ సర్వీసులు విజయవంతంగా నడుస్తుండటంతో, ఇప్పుడు మెట్రో అధికారులు అమీర్ పేట-హైటెక్ సిటీ కారిడార్ పై దృష్టి కేంద్రీకరించి వేగంగా పనులు జరిపిస్తున్నారు. అదేవిధంగా ఎల్.బి.నగర్-అమీర్ పేట కారిడార్-1 లో పెండింగ్ పనులను కూడా పూర్తిచేసి వచ్చే ఏడాది ఆగస్ట్ లోగా రెండు మార్గాలలో మెట్రో రైల్ సర్వీసులను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ రెండు కారిడార్లలో పనులు పూర్తిచేసిన తరువాత నగరంలో మెట్రో నిర్మాణ పనులకు ముగింపు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే పాతబస్తీలో దారుల్ షిఫా, అలీజకోట్ల, హరిబౌలి మీదుగా నిర్మించాలనుకొన్న 6కిమీ పొడవు గల మెట్రో కారిడార్ నిర్మాణం చేయకపోవచ్చు. 

మజ్లీస్ పార్టీ అభ్యంతరాలు, ఆ కారణంగా డిజైన్ లో మార్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడటం, ఆ కారణంగా నిర్మాణవ్యయం భారీగా పెరిగిపోవడం వంటి కారణాలు కనబడుతున్నాయి. 

కనుక జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్ టెర్మినల్ (ఇమ్లీబన్) వరకు మాత్రమే మెట్రో కారిడార్ నిర్మాణాలు పూర్తి చేయాలని మెట్రో ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కారిడార్-3 క్రింద రాయదుర్గ్ వరకు నిర్మాణపనులు రెండేళ్ళలో పూర్తి చేయాలని ఎల్ అండ్ టి సంస్థ లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలుస్తోంది. నగరపరిధిలోని ఈ ప్రాజెక్టు పనులన్నిటినీ పూర్తి చేయడానికి కేంద్రప్రభుత్వం 2018 నవంబర్ వరకు గడువు ఇచ్చింది. కనుక ఆలోగానే మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ఆ సంస్థ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 

పాతబస్తీ మీదుగా మెట్రో రైల్ కారిడార్ నిర్మాణం జరుపబోవడం లేదనే సంగతి పసిగట్టినందునే ఇటీవల టి-కాంగ్రెస్ నేతలు పాతబస్తీకి మెట్రో రైల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రకు సిద్దం అయినట్లున్నారు.