టిటిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు గవర్నర్ పదవిపై ఆశతో మూడేళ్ళకు పైగా రాజకీయాలకు దూరంగా ఉండి ఎదురుచూసిన తరువాత, ఇక తనకు గవర్నర్ యోగం లేదని గ్రహించడంతో మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు. అయన నిన్న మీడియాతో అనేక ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
“ఇంకా గవర్నర్ పదవి కోసం ఆశగా ఎదురుచూపులు చూస్తూ కూర్చోవడం వలన ప్రయోజనం ఏమీ ఉండదని అర్ధం అయ్యింది. నాకు గవర్నర్ పదవి ఇప్పించేందుకు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు. కనుక ఇక దాని గురించి ఆలోచించడం కూడా అనవసరమని భావిస్తున్నాను,” అని అన్నారు.
రేవంత్ రెడ్డి గురించి విలేఖరి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా, “అసలు రేవంత్ రెడ్డి ఎవరు? ఆయనకు చంద్రబాబు నాయుడు, మీడియా అతిగా ప్రాధాన్యం ఇవ్వడం వలననే ఈ స్థాయికి ఎదిగాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా అతని నియామకం ఒక పొరపాటు నిర్ణయమేనని భావిస్తున్నాను. చంద్రబాబుకు అతనిపై ఎందుకో చాలా నమ్మకం ఉండేది. కానీ దానినీ అతను వమ్ము చేశాడు. పార్టీ అధిష్టానం ఇచ్చిన ప్రోత్సాహాన్ని అయన తన స్వంత ఇమేజ్ పెంచుకొనేందుకే ఉపయోగించుకొని, తెలంగాణాలో తెదేపాను పూర్తిగా భ్రష్టు పట్టించేశాక కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసేశాడు. అయితే అతను వెళ్ళిపోయినందున తెలంగాణాలో తెదేపా తుడిచిపెట్టుకుపోతుందని మీడియాలో వస్తున్న వార్తలు సరికాదు. అటువంటివారు పార్టీలో నుంచి వెళ్ళిపోవడం వలననే మళ్ళీ రాష్ట్రంలో పార్టీ బలపడుతుంది. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు ఏపికి వెళ్ళిపోవడం వలననే మా పార్టీ కొంత బలహీనపడిన మాట వాస్తవం. ఆయన ఏపికి వెళ్ళిపోవడంతో తెలంగాణాలో మా పార్టీకి నాయకత్వలోపం ఏర్పడిన మాట వాస్తవమే. అయితే నేటికీ మా పార్టీ ఇంకా కొంత బలంగానే ఉందంటే కారణం ఆనాడు చంద్రబాబు చేసిన అభివృద్ధి పనుల పట్ల తెలంగాణా ప్రజలు సంతృప్తిగా ఉన్నందునే. మా పార్టీకి ప్రజల మద్దతు, ఆశీర్వాదం ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరు. చేయగలమనుకొంటే అది కేవలం భ్రమే! పార్టీలో ఉన్న మేమందరం కృషి చేసి పార్టీని కాపాడుకొంటాము,” అని అన్నారు మోత్కుపల్లి నరసింహులు.