చంద్రబాబుతో కెసిఆర్ ముచ్చట్లు!

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గౌరవార్ధం గవర్నర్ నరసింహన్ ఆదివారం రాత్రి రాజ్ భవన్ లో ఇచ్చిన విందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రతిపక్ష నేతలు, ఉన్నతాధికారులు, నటులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రానా తదితరులు హాజరయ్యారు. ఈ విందు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, కెసిఆర్ ఒక పక్కకు వెళ్ళి మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్శించింది. హైదరాబాద్ సచివాలయంలో ఏపికి కేటాయించిన భవనాలను తమకు అప్పగించవలసిందిగా కెసిఆర్ కోరగా దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకొని తెలియజేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల బదిలీ అంశంపై కూడా వారు చర్చించుకొన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత చిరంజీవి కూడా అక్కడకు రావడంతో జాతీయ రాజకీయాలు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుకొన్నట్లు సమాచారం. ఈ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పవన్ కళ్యాణ్ తో కూడా కాసేపు మాట్లాడారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు కూడా వేరేగా మాట్లాడుకొన్నారు. మొత్తం మీద ఇంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉన్దేవారందరూ ఈ విందు కార్యక్రమంలో మాట్లాడుకోవడం విశేషమే. 

ప్రతీ ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చి బొల్లారంలోగల రాష్ట్రపతి నిలయంలో బస చేయడం ఆనవాయితీ. దాని ప్రకారమే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఆయన గౌరవార్ధం గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్ లో నిన్న ఈ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.