తెరాసలో 40 మందికి కష్టమేనట!

ముఖ్యమంత్రి కెసిఆర్ ఏడాదికి ఒకటి రెండుసార్లు తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపట్ల ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారనే విషయం తెలుసుకొనేందుకు వేర్వేరు ఏజన్సీల ద్వారా సర్వేలు చేయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయన తాజాగా చేయించిన సర్వే ఫలితాల గురించి ‘ది సియాసత్ డైలీ’ ఇంగ్లీష్ దినపత్రికలో ఇటీవల ఒక ఆసక్తికరమైన వార్త ప్రచురితమైంది. 

దాని ప్రకారం తెరాస ఎమ్మెల్యేలలో కనీసం 40 మంది, అలాగే మజ్లీస్ పార్టీలో 7మంది ఎమ్మెల్యేల పనితీరుపట్ల తెలంగాణా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కనుక వచ్చే ఎన్నికలలో వారు గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ చేయించిన తాజా సర్వేలో తేలిందని ఆ పత్రిక పేర్కొంది. కనుక ఆ 40 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపరుచుకోవడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ 6 నెలలు గడువు ఇచ్చారని పేర్కొంది. అదేవిధంగా మజ్లీస్ అధిష్టానం ఆ ఏడుగురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో టికెట్స్ నిరాకరించడమో లేదా వేరే నియోజకవర్గాలకు మార్చడమో చేయవచ్చని పేర్కొంది. 

ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియాలో నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల పనితీరు గురించి వెలువడుతున్న కధనాలలో అనేక నియోజకవర్గాలలో అపరిష్కృత సమస్యలు వెలుగుచూస్తున్నాయి. అలాగే ఎమ్మెల్యేల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోకపోవడం, ప్రజాసమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించడం, మరికొంతమంది అహంకారంగా వ్యవహరిస్తూ కలెక్టర్లు, అధికారులతో దురుసుగా వ్యవహరిస్తుండటం వంటి అనేక కారణాలు కనిపిస్తూనే ఉన్నాయి. వాటిని తెరాస ఖండించవచ్చు లేదా వారిని ప్రతిపక్షాలకు చెందినవ్యక్తులుగా అభివర్ణించి చేతులు దులుపుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేయించిన సర్వేలో కూడా అదేవిధంగా ప్రజాభిప్రాయం వెలువడటం నిజమైతే, తెరాసకు అది ‘అలారం బెల్’ వంటిదేనని భావించవచ్చు. కనుక రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, అది చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలలో సంతృప్తివ్యక్తం అవుతున్నప్పటికీ, ఎమ్మెల్యేల పనితీరుపట్ల ప్రజలలో అసంతృప్తి నెలకొని ఉండటం ప్రమాద సంకేతంగానే భావించవచ్చు.