ఓయు అంటే కెసిఆర్ కు ఇష్టం లేదా?

తెలంగాణా ఉద్యమాలలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధుల పాత్ర గురించి అందరికీ తెలిసిందే. కానీ రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత వారికీ, ప్రభుత్వానికి మద్య దూరం పెరుగుతూనే ఉంది. కారణాలు అందరికీ తెలిసినవే. ఈ 42 నెలలలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకే ఒక్కసారి యూనివర్సిటీలో కాలుపెట్టారు. అప్పుడు కూడా ఒక్క ముక్క మాట్లాడలేదు. దానిని బట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులకు-ముఖ్యమంత్రి కెసిఆర్ కు మద్య ఎంత దూరం పెరిగిందో ఊహించవచ్చు. 

ఈ నేపద్యంలో వచ్చే నెలలో ఉస్మానియా యూనివర్సిటీలో జరుగవలసిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభలు ఆఖరు నిమిషంలో వాయిదా పడ్డాయి. ప్రతిష్టాత్మకమైన ఆ సభలు ఈవిధంగా వాయిదా పడటం ఇదే మొదటిసారి. కనుక సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర భాజపా నేతలు నిన్న హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించి, ప్రతిష్టాత్మకమైన ఈ సభలు జరుగకపోవడానికి కారణం ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఉస్మానియా యూనివర్సిటీ పట్ల ఉన్న వ్యతిరేకతేనని ఆరోపించారు. 

భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “కెసిఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధుల పట్ల అకారణ ద్వేషం పెంచుకొన్నారు. అక్కడ ఈ సభలు జరుగడం ఆయనకు ఇష్టం లేదు కనుకనే వాటి నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చి వాయిదా వేయించారు. ఈ సభలకు 62 దేశాల ప్రతినిధులు, ఏడుగురు నోబుల్ గ్రహీతలు, దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వందలాదిమంది విద్యావేత్తలు, ప్రముఖులు హాజరయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ సభల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారు. ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు, ఉద్యోగులు కూడా గత మూడు నెలలుగా ఈ సభల కోసం చాలా ఏర్పాట్లు చేశారు. 

అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరువాత ఇక సభలు జరుగవలసిన సమయం దగ్గర పడుతున్నప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యతిరేకత కారణంగా సభలను వాయిదా వేయడం సరికాదు. ప్రతిష్టాత్మకమైన ఈ సభలు ముందు అనుకొన్న ప్రకారం జరుగకపోతే అది రాష్ట్ర ప్రభుత్వానికి, ఉస్మానియా యూనివర్సిటీకి, రాష్ట్రానికి, విద్యార్ధులకు అందరికీ అప్రదిష్ట...అవమానకరమే. కనుక ముఖ్యమంత్రి కెసిఆర్ తన వైఖరి మార్చుకొని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభలు వాయిదాపడకుండా ఉస్మానియా యూనివర్సిటీలోనే నిర్వహింపజేయాలి. అవసరమనుకొంటే మా పార్టీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులతో మాట్లాడి వాటికి ఎటువంటి ఆటంకం కలుగకుండా చూస్తామని హామీ ఇస్తున్నాము,” అని అన్నారు.