బంగారు తెలంగాణాలో మహిళలకు స్థానం లేదా?

“తెలంగాణాలో మహిళలు అంటే కేవలం తెరాస ఎంపి కవిత మాత్రమేనా? రాష్ట్రంలో మరెవరూ మహిళలు లేరా? వారికి ప్రభుత్వంలో, పార్టీలో ప్రాధాన్యత లేదా? బంగారు తెలంగాణాలో మహిళలకు స్థానం లేదా?” అని ప్రశ్నించారు తెలంగాణా యునైటడ్ ఫ్రంట్ విమలక్క. 

బాగ్ లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణా మహిళాహక్కులవేదిక అధ్వర్యంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మహిళానేతలు రాష్ట్రంలో మహిళల పట్ల తెలంగాణా ప్రభుత్వం కనబరుస్తున్న చులకనభావాన్ని తీవ్రంగా నిరసించారు. 

మహిళా వేదిక అధ్యక్షురాలు రేఖ మాట్లాడుతూ, “ఆనాడు తన పాటలతో తెలంగాణా ఉద్యమజ్వాలను రగిలించి తెలంగాణా సాధనలో కీలక పాత్ర పోషించిన విమలక్కను తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత మెడ పట్టుకొని బయటకు గెంటివేసింది.  ప్రాజెక్టుల పేరుతో నిరుపేద రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకొంటుంటే అడ్డుపడిన రచనారెడ్డి పట్ల తెరాస నేతలు చాలా అనుచితమైన బాషతో మాట్లాడుతూ ఆమెను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించారు. ఇక తెరాస సర్కార్ లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం గమనిస్తే తెరాసకు మహిళల పట్ల ఎంత చిన్నచూపు ఉందో అర్ధం అవుతోంది. రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత లేకుండా పోయింది. ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చే గౌరవం?” అని ఆవేదన వ్యక్తం చేశారు.