కాంగ్రెస్ మంత్రులు అప్పుడేరాజీనామాలు చేసి ఉంటే...

మొన్న జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనగర్జన సభలో కాంగ్రెస్ నేతలు తెరాస సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వాటికి సమాధానంగా మంత్రి సి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు నిన్న ఇంకా ఘాటుగా ప్రతివిమర్శలు చెశారు. 

మంత్రి సి లక్ష్మారెడ్డి గురువారం తెరాస ఎల్పి కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ జడ్చర్లలో నిర్వహించిన సభకు జనాలు రాకపోవడం గమనిస్తే, దానికి ప్రజాధారణ లేదని అర్ధం అవుతోంది. అటువంటి పార్టీ 2019 ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని పగటికలలు కంటోంది. కానీ అది 2029కైనా అధికారంలోకి రాలేదని ఖచ్చితంగా చెప్పగలను. తెలంగాణా సాధన కోసం జోరుగా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఇదే కాంగ్రెస్ నేతలు అందరూ పదవులు పట్టుకొని వ్రేలాడుతూ తెలంగాణాకు తీరని ద్రోహం చేశారు. వారు ఆనాడే తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి వచ్చి ఉండి ఉంటే కేంద్రంపై ఒత్తిడి పెరిగి ఉండేది. ఇంకా ముందుగానే తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఉండేది. కానీ కాంగ్రెస్ నేతలు పదవులకే ప్రాధాన్యత ఇవ్వడంతో తెలంగాణా ఏర్పాటు ఇంకా ఆలస్యం అయ్యింది. ఆ కారణంగా అనేకమంది విద్యార్ధులు బలిదానాలు చేసుకొన్నారు. వారి మరణాలకు కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని మరిచిపోయి, తెలంగాణా ఇచ్చిన తమకు రాష్ట్ర ప్రజలు రుణపడి ఉండాలన్నట్లు వారు మాట్లాడటం సిగ్గుచేటు. కమీషన్లు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇప్పుడు తుపాకీ రాముడి కధలు చెపుతున్నారు. అయన కాంగ్రెస్ పార్టీలో కొత్త జోకర్ వంటివాడు. మాది మొదటి నుంచి ఆర్ధికంగా కలిగిన కుటుంబమే. కనుక డబ్బుకు కక్కుర్తి పడవలసిన అవసరం నాకు లేదు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు మానుకొంటే మంచిది,” అని అన్నారు. 

ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కాలం నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు సాగుతున్నది కుటుంబపాలనే కదా! అది మరిచిన కాంగ్రెస్ నేతలు తెరాసలో కుటుంబపాలన సాగుతోందని విమర్శించడం సిగ్గుచేటు.  హరీష్ రావు, కేటిఆర్, కవిత ముగ్గురూ కూడా తెలంగాణా ఉద్యమాలలో పాల్గొని, ఎన్నికలలో పోటీ చేసి ప్రజామోదంతో గెలిచిన నేతలు. వారు తమ సమర్ధను, నాయకత్వ లక్షణాలను నిరూపించుకొంటూ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా వారిని ప్రశంసిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల కళ్ళకు ఇవేవీ కనబడకపోవడం విచిత్రమే. మాజీ కేంద్రమంత్రి, జాతీయస్థాయి నాయకుడినని గొప్పలు చెప్పుకొనే జైపాల్ రెడ్డి తన జిల్లాకు అసలు ఏమి చేశారో చెప్పగలరా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం వారికి ఎంతసేపు పదవులు, అధికారం మీదనే దృష్టి ఉంటుంది తప్ప ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిపై ఉండదు. అటువంటి నేతలా మమ్మల్ని ప్రశ్నించేది?” అని అన్నారు.