తూచ్...ఆ సంగతి నాకు తెలియదు!

తమిళనాడు సాంబారుకు ఎంత ప్రసిద్దో ఆ రాష్ట్ర రాజకీయాలు కూడా అంత ప్రత్యేకమైనవి. వాటికి దేశంలో మరే రాష్ట్ర రాజకీయాలతో సారూప్యత ఉండదు. సల్మాన్ ఖాన్ శ్రీలంక పర్యటనకు వెళ్ళినా, జల్లికట్టు క్రీడకు సుప్రీం కోర్టు అభ్యంతరం చెప్పినా, చెన్నైలో భారీ వర్షాలు కురిసినా రాజకీయ ప్రకంపనలు మొదలైపోతాయి. అంత డిఫరెంట్! జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్.కె.నగర్ ఉపఎన్నికలలో మరి సామాన్యంగా జరుగుతాయా? 

అమ్మ చనిపోయి ఏడాదవుతున్నా అమ్మపేరు చెప్పి ఓట్లు దండుకొనేందుకు చాలా మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదివరకు ఏప్రిల్ 12న ఉపఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్దమైనప్పుడు, ఒక అభ్యర్ధి జయలలిత బొమ్మను శవపేటికలో పెట్టి దానిని తన వాహనం ముందు బిగించుకొని ప్రచారం చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. 

ఈసారి శశికళ మేనల్లుడు దినకరన్, పోలింగుకు ఒక్కరోజు ముందు అపోలో ఆసుపత్రిలో ‘అమ్మ’ ఫోటోను, వీడియోను విడుదలచేసి తన ప్రత్యర్ధులను చిత్తు చేసేందుకు ప్రయత్నించాడు. ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పకపోయుంటే ఆ ఐడియా బ్రహ్మాండంగా పనిచేసి ఉండేది కానీ దురదృష్టవశాత్తు ఈసి దానిని అడ్డుకొంది. ఆ వీడియోను విడుదల చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమేనని కనుక బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

ఈ కారణంగా ఈసీ తనపై అనర్హత వేటువేసే ప్రమాదం ఉందని గ్రహించిన దినకరన్ వెంటనే చాలా తెలివిగా తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నా అనుచరుడు వెట్రివేల్ నాకు తెలియజేయకుండా ఆ వీడియోను మీడియాకు  విడుదల చేశారు. ఆ సంగతి టీవి  ఛానల్స్ లో చూసినప్పుడే నాకు తెలిసింది. ఏప్రిల్ 12న జరుగలసిన ఉపఎన్నికలలోనే దానిని విడుదల చేద్దామని మా అనుచరులు నాపై ఒత్తిడి తెచ్చినప్పటికీ, ఆ వీడియోలో అమ్మ నైటీలో ఉన్నందున ఆమె గౌరవానికి భంగం కలగకూడదని అప్పుడు నేను అంగీకరించలేదు. ఈసారి నాకు తెలియకుండా మావాళ్ళు దానిని విడుదల చేసేశారు. అమ్మ కోరినందునే శశికళ ఆసుపత్రిలో ఆ వీడియోను షూట్ చేశారు. కానీ ఆమె గౌరవానికి భంగం కలగకూడదని మీడియాకు విడుదల చేయలేదు. శశికళ జైలుకు వెళుతున్నప్పుడు ఆ వీడియోను నాచేతికిచ్చారు. అప్పటి నుంచి అది నాదగ్గరే భద్రంగా ఉంది. ఈ సంగతి ముఖ్యమంత్రి పళనిస్వామికి అయన మంత్రులకు కూడా తెలుసు. అమ్మ మృతిపై ప్రభుత్వం నియమించిన కమీషన్ కోరినట్లయితే మావద్ద ఉన్న అన్ని ఆధారాలను అందజేయడానికి సిద్దంగా ఉన్నాము,” అని అన్నారు.