తెరాస సర్కార్ పై కాంగ్రెస్ నేతల విమర్శలు

మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్లలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ‘జనగర్జన’ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ ఆర్.సి.కుంతియాతో సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందరూ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “2019 ఎన్నికలలో రాహుల్ గాంధీ నేతృత్వంలో మా పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయిలో విజయం సాధించడం ఖాయం. వచ్చే ఎన్నికలలో ఈ ఉమ్మడి జిల్లాలో గల 14 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకొంటుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాయమాటలు చెపుతూ మభ్యపెడుతున్నారు. అయన ఎప్పుడు ఏవిధంగా వారికి రిజర్వేషన్లు కల్పించగలరో చెప్పగలరా? అలాగే మూడు జిల్లాలలో ఆదివాసీలకు, లంబాడీలకు మద్య ఘర్షణలు జరుగుతుంటే ఇంతవరకు మంత్రులెవరూ అక్కడ పర్యటించలేదు. బిసిలపై ముఖ్యమంత్రి కెసిఆర్ కు నిజంగా అంత ప్రేమ ఉన్నట్లయితే, జనాభా ప్రాతిపదికన వారికి తన మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి. ఈ మూడున్నరేళ్ళలో కెసిఆర్ సుమారు రూ.70,000 కోట్లు ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు,” అని విమర్శించారు.       

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ కుంతియా మాట్లాడుతూ, “గుజరాత్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ కనబడకుండా పోతుందని మోడీ అన్నారు. కానీ ఫలితాలు చూసి మోడీకే ముచ్చెమటలు పట్టాయి. ఇక మోడీని ఆ కుర్చీలో నుంచి దింపి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయవలసిన సమయం ఆసన్నమైంది. మోడీ, కెసిఆర్ వల్ల తెలంగాణా రాష్ట్రం ఏర్పడలేదు. విద్యార్ధుల బలిదానాలను చూసి చలించిపోయిన సోనియా గాంధీ తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆమె అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యం ఉండే సామాజిక తెలంగాణా ఏర్పడాలని కోరుకోగా, కెసిఆర్ కుటుంబపాలనను తీసుకువచ్చారు. ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలకు మాయమాటలు చెపుతూ కాలక్షేపం చేసేస్తున్నారు. కనుక ఇక్కడ కెసిఆర్ ను కూడా గద్దె దించాల్సిన అవసరం ఉంది, అని అన్నారు.               

 రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి బహిరంగ సభ ఇది. కనుక దీనికి చాలా ప్రాధాన్యత ఉందన్నారు జైపాల్ రెడ్డి. “ఈ మూడున్నరేళ్ళలో తెరాస సర్కార్ రూ.40,000 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది. అది ఎవడబ్బ సొమ్మని ఖర్చు చేస్తున్నారు? మేము అధికారంలోకి రాగానే దీనిపై విచారణ జరిపిస్తాము,” అని జైపాల్ రెడ్డి హెచ్చరించారు.     

కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,నాగర్ కర్నూల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తన స్వంత నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి తెచ్చుకోలేరు కానీ జడ్చర్లను ఉద్దరిస్తానంటారు. మంత్రి హరీష్ రావును ఉద్దేశ్యించి కల్వకుర్తి కాలువల వెంబడి కొత్త బిచ్చగాళ్ళు తిరుగుతున్నారిప్పుడు అని ఎద్దేవా చేశారు.  

మాజీమంత్రి డికె అరుణ మాట్లాడుతూ, “మా కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకే పేర్లు మార్చి, డిజైన్లు మార్చి తెరాస సర్కార్ తమవిగా చెప్పుకొంటోంది. రాష్ట్రంలో చాలా అభివృద్ధి జరిగిపోతోందన్నట్లు ప్రచారమే తప్ప జరిగిందేమీ కనబడదు. మాయమాటలతో కాలక్షేపం చేస్తున్న కెసిఆర్ కు వచ్చే ఎన్నికలలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు,” అని అన్నారు.     

అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ, “మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి, గవర్నర్ నరసింహన్ కు పాదాభివందనాలు చేసే ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఎందుకు పాదాభివందనం చేయలేదంటే అయనకు దళితులంటే చిన్న చూపు కనుకనే,” అని ఆరోపించారు.