దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఉపఎన్నికలు జరుగుతూనే ఉంటాయి కానీ వాటిలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్.కె.నగర్ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలకు ఏర్పడిన ప్రాధాన్యం మరి దేనికి లేదంటే అతిశయోక్తి కాదు. కొద్ది సేపటిక్రితమే ఆ నియోజకవర్గంలో పోలింగ్ మొదలైంది.
జయలలిత మృతి తరువాత తమిళనాడులో అధికార అన్నాడిఎంకె వర్గాల మద్య మొదలైన ఆధిపత్యపోరు కారణంగా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంది. ఈ నేపధ్యంలో ఈ ఉపఎన్నికలు జరుగుతున్నందున అధికార అన్నాడిఎంకె, దాని చీలిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దినకరన్ తామే జయలలితకు అసలైన వారసులమని నిరూపించుకొని రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు సాధించాలని తహతహలాడుతున్నాయి. సుమారు ఏడాదిన్నరగా రాష్ట్రంలో నెలకొన్న ఈ రాజకీయ అనిశ్చితికి కారకులైన అన్నాడిఎంకెపై ప్రజలలో నెలకొన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఇదే సరైన అవకాశమని ప్రధాన ప్రతిపక్షపార్టీ డిఎంకె భావిస్తోంది. కనుక ఈ మూడు వర్గాలు ఈ ఉపఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. ఈ నెల 24న ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఆర్.కె.నగర్ ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారో తెలుస్తుంది.