ప్రపంచ తెలుగు మహాసభలలో మూడవ రోజైన సోమవారంనాడు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులందరినీ సన్మానించింది. ఎల్.బి.స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కె.రాఘవేంద్ర రావు, ఆర్. నారాయణ మూర్తి, ఎన్.శంకర్, నరసింగ రావు, జమున, సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, జయసుధ, ప్రభ, మోహన్ బాబు, గిరిబాబు, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ళ భరణి, కోటా శ్రీనివాసరావు, హేమ, బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వర రావు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, తమ్మారెడ్డి భరద్వాజ, రాజమౌళి, అశ్వినీదత్, దిల్ రాజు, అల్లు అరవింద్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, సునీత తదితరులు హాజరయ్యారు.
వారిలో సీనియర్ నటుడు కృష్ణ మాట్లాడుతూ, “అలనాటి శ్రీకృష్ణదేవరాయలు అంతటివాడు మన తెలుగు బాష గొప్పదనాన్ని గుర్తించి దేశబాషలందు తెలుగు లెస్స అని ప్రశంసించారు. అటువంటి గొప్ప తెలుగు బాషను అందరూ కలిసి కాపాడుకోవాలి,” అని అన్నారు.
అలనాటి అందాల నటి జమున మాట్లాడుతూ “మొట్టమొదటి తెలుగు మహాసభలను అలనాటి ముఖ్యమంత్రి జలగం వెంగల రావు నిర్వహించారు. మళ్ళీ ఇన్నాళ్ళకు తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి తెలుగు బాష పట్ల తన అభిమానాన్ని చాటుకొంది. మహాసభల మొదటిరోజున ముఖ్యమంత్రి కెసిఆర్ నోట అలవోకగా తెలుగు పద్యాలు జాలువారడం నాకు చాలా ఆనందం కలిగించింది,” అని అన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ, “ఇతర రాష్ట్రాల వారందరూ తమ మాతృ బాషలో మాట్లాడుకోవడానికే ఇష్టపడుతుంటారు కానీ ఒక్క తెలుగువారే సాటి తెలుగువాడితో ఇంగ్లీషులో మాట్లాడుతూ అదే గొప్ప అనుకొంటారు. ఈ తీరు మారాలి,” అని అన్నారు.
తెలుగు మహాసభలకు నందమూరి బాలకృష్ణ పంచెకట్టుతో రావడం అందరినీ ఆకట్టుకొంది. ఆయన మాట్లాడుతూ, “తెలుగుబాష, ఎన్టీఆర్ పేరు వింటే ఒళ్ళు పులకరిస్తుంది. కానీ ఇప్పుడు అందరూ తెలుగు బాషకు దూరం అవుతూ ‘మమ్మీ డాడి..’సంస్కృతికి అలవాటు పడిపోయారు. తెలుగు బాషను అందరూ కలిసి కాపాడుకోవాలి,” అని అన్నారు.
నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ, “ప్రపంచ తెలుగు మహాసభలు ఇంత వైభవంగా నిర్వహిస్తునందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు. అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తూ ‘బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపిక అయినందుకు మంత్రి కేటిఆర్ కు అభినందనలు,” అని అన్నారు. అనంతరం కేటిఆర్ కు శాలువా కప్పి సన్మానించారు. ఇంకా రాజమౌళి, రాఘవేంద్ర రావు తదితరులు ప్రసంగిస్తూ తెలుగు బాషాభివృద్ధికి అనేక విలువైన సలహాలు ఇచ్చారు. తెలంగాణా ప్రభుత్వం తరపున మంత్రులు కేటిఆర్, తలసాని, ఈటల, గవర్నర్ నరసింహన్ తదితరులు సినీ ప్రముఖులు అందరినీ ఘనంగా సన్మానించారు.