అయ్యో...ఆ జిల్లాలో ఏమి జరుగుతోంది?

ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఆదివాసీలు, లంబాడీల మద్య ఎవరు, ఎందుకు చిచ్చు రగుల్చుతున్నారో తెలియదు కానీ ఇరువర్గాల ప్రజలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకొంటున్నారిప్పుడు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజన్సీ ప్రాంతం ఇప్పుడు ఇరుపక్షాల గొడవలతో యుద్ధక్షేత్రంగా మారిపోయింది. జిల్లాలో నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామ పంచాయితీ పరిధిలో బెతల్ గూడా గ్రామంలో గల కుమ్రం భీం విగ్రహం మెడలో నిన్నరాత్రి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చెప్పుల దండవేశారు. ఈ సంగతి తెలుసుకొన్న స్థానిక ఆదివాసీలు ఆగ్రహంతో ఊగిపోతూ వేలాదిమందిగా హుస్నాపూర్ తరలివచ్చి అక్కడ రెండు వైన్ షాపులకు మంటపెట్టారు. ఊరిలో లంబాడీలకు చెందిన కొన్ని ఇళ్ళకు, రోడ్డుపై ఉన్న అనేక వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. మాజీ ఎంపి రాధోడ్ రమేష్ కు చెందిన సేవలాల్ ఆసుపత్రిపై కూడా రాళ్ళు రువ్వడంతొ కిటికీల అద్దాలు పగిలిపోయాయి. వారు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చి జాతీయ రహదారిపై బైటాయించడంతో బారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

విగ్రహానికి చెప్పుల దండవేశాడనే అనుమానంతో ఒక లంబాడీ యువకుడిపై ముగ్గురు ఆదివాసీ యువకులు దాడి చేసి గాయపరచడంతో లంబాడీలు కూడా అక్కడకు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని వారిపై ఎదురుదాడికి ప్రయత్నించగా పోలీసులు అందరినీ చెదరగొట్టారు. అదే సమయంలో ప్రయాణికులతో అటుగా వెళుతున్న ఒక జీప్ పై లంబాడీలు దాడికి ప్రయత్నించడంతో జీపు డ్రైవర్ భయపడి వేగంగా బండి నడిపించడంతో దాని క్రిందపడి షేక్ ఫరూక్ (47), రాధోడ్ జితేందర్ (25), రవీందర్ (27) అనే ముగ్గురు యువకులు మరణించారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీనితో ఆ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్తతలు పెరిగాయి. 

పోలీసులు ఇరువర్గాల నేతలకు నచ్చజెప్పి వెనక్కు త్రిప్పి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఉట్నూర్ ఏరియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనున్నందున జిల్లా ఎస్పి శ్రీనివాస్ హై అలర్ట్ ప్రకటించి బారీగా పోలీసులను మొహరించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నప్పటికీ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఏజన్సీ ప్రాంతాలలో ఇటువంటి గొడవలు జరుగడం, ఉద్రిక్తత వాతావరణం ఏర్పడటం చాలా ఆందోళనకరమైన విషయమే.