మహాసభలలో అసమదీయులు..తసమదీయులు!

డిసెంబర్ 15 నుంచి 19వరకు హైదరాబాద్ లో జరుగబోతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు తెలంగాణా రాష్ట్రానికే చెందిన ప్రముఖ విప్లవ కవులు గద్దర్, అందెశ్రీ, గోరేటి వెంకన్న, విమలక్క, తిరుమల్ రావు, జైభీమ్ తదితరులను తెలంగాణా ప్రభుత్వం ఆహ్వానించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. 

ఆ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా ఉద్యమాలలో తమ ఆటపాటలతో ప్రజలలో నూతనోత్సాహం నింపి తెలంగాణా సాధనలో కీలకపాత్ర వహించిన మన తెలంగాణా కవులను, కళాకారులను ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానించకపోవడం చాలా దారుణం. వారందరూ తెలంగాణా గొప్పదనాన్ని లోకానికి ఎలుగెత్తి చాటిచెప్పినవారే. వారిప్పుడు తెలంగాణా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కనుక వారిని ఆహ్వానించకుండా, ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఉన్న తెలుగు రచయితలను, కవులను వెతికిపట్టుకొని వారికి ఆహ్వానాలు పంపిస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్ అహంకారానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.”

“ఈ మహాసభలు తెలుగు బాషకు ఏమైనా ఉపయోగపడుతాయో లేదో తెలియదు కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వంత డప్పు కొట్టుకోవడానికి మాత్రం పనికివస్తాయి. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు ప్రజాధనం వృధా చేస్తోంది. ఇదే కెసిఆర్ 2012లో ప్రపంచ తెలుగు మహాసభలను వ్యతిరేకించారు. ఇప్పుడు ఆయనే ఎందుకు పూనుకొని జరిపిస్తున్నారు? అంటే ఆర్ధిక సమస్యల కారణంగా ఒకవైపు వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. మరోపక్క ఉద్యోగాల భర్తీ చేయకపోవడం వలన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొంటునే ఉన్నారు. ఈ సమస్యల నుంచి అందరి దృష్టి మళ్ళించి తన ఇమేజ్ పెంచుకోవడానికే కెసిఆర్ ఈ మహాసభలను నిర్వహిస్తున్నారు. వీటివలన తెలుగు బాషకు కొత్తగా ఒరిగేదేమీ ఉండదు కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి,” అని దాసోజు శ్రవణ్ విమర్శించారు.