తెలంగాణా హోంగార్డులకు శుభవార్త!

రాష్ట్రంలో హోంగార్డులకు శుభవార్త. వారికి ప్రస్తుతం నెలకు రూ.12,000 జీతం లభిస్తోంది. దానిని ఒకేసారి రూ. 20,000 కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. 

ఇవ్వాళ్ళ హోంగార్డులతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ లో సమావేశమయ్యి వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ వంటి మహానగరంలో నెలకు రూ. 12,000 చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమని అన్నారు. కనుక వారికి జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి వారికి కూడా ప్రతీ ఏడాది రూ.1,000 చొప్పున జీతం పెంచుతామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. 

ప్రత్యేక కానిస్టేబుల్స్ నియామకాలలో  హోంగార్డులకు 25 శాతం, రిజర్వేడ్ కానిస్టేబుల్స్ నియామకాలలో 15 శాతం, పోలీస్ శాఖలో డ్రైవర్ ఉద్యోగాలలో 20 శాతం, కమ్యూనికేషన్స్ విభాగంలో 10 శాతం నేటి నుంచే రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా కానిస్టేబుల్ పరీక్షలు వ్రాసే హోంగార్డులకు వయోపరిమితిని 40 ఏళ్ళకు పెంచుతున్నట్లు  ప్రకటించారు. పోలీస్ శాఖలో రోస్టర్ విధానం అమలుచేస్తునే కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్షలు వ్రాస్తున్న హోంగార్డుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను కోరారు.

ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న హోం గార్డులకు శాశ్విత ఉద్యోగులతో సమానంగా అన్ని అలవెన్సులు చెల్లిస్తామని చెప్పారు. బందోబస్తు డ్యూటీలకు హాజరయ్యే హోం గార్డులకు పోలీసులతో సమానంగా అలవెన్సులు ఇస్తామని చెప్పారు. ప్రతీ ఏడాది ఒక్కొక్క హోం గార్డుకు నాలుగు జతల యూనిఫారంలు ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. 

హోం గార్డులకు కూడా పోలీసులతో సమానంగా వైద్యభీమా, వైద్య సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. త్వరలోనే వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా పోలీస్ ఆసుపత్రులలో చికిత్స సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.  గర్భవతులైన మహిళా హోంగార్డులకు 6 నెలలు ప్రసూతీ శలవు ఇస్తామని తెలిపారు. 

హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న హోం గార్డులందరికీ బస్సు పాసులు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 18,900 హోం గార్డులకు వారు కోరుకొన్న ఊరిలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. 

హోం గార్డుల దయనీయ పరిస్థితుల గురించి తాను మీడియా ద్వారా విన్నానని, కనుక మీ సమస్యలను స్వయంగా తెలుసుకొని వాటిని పరిష్కరించడం కోసమే ఈరోజు మీతో నేరుగా సమావేశం అయ్యానని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పడంతో హోంగార్డులు చాలా సంతోషించారు. ఎవరూ ఊహించని విధంగా ఒకేసారి జీతల పెంపు, ఇంక్రిమెంట్లు, అలవెన్సుల మంజూరు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వంటి అనేక వరాలను పొందడంతో వారు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తమ సమస్యల పట్ల ఇంత సానుకూలంగా, మానవతా దృక్పదంతో స్పందించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు వారు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.